ఓరుగల్లు పశ్చిమ కాంగ్రెస్ లో రగిలిన ఆధిపత్య పోరు పీక్స్ చేరింది. వరంగల్ డీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన ఎర్రబెల్లి స్వర్ణ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం రసాభాసగా మారింది.. ఇరు వర్గీయుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మొన్న హనుమకొండ.. నిన్న జనగామ.. నేడు వరంగల్.. కాంగ్రెస్ నేతల వర్గపోరు ముష్టియుద్ధంగా మారింది. కాంగ్రెస్ ను బలోపేతం చేసేందుకు ఒకవైపు రాష్ట్రస్థాయి నేతలు పాదయాత్రలు.. మరోవైపు జిల్లా స్థాయిలో ముష్టియుద్ధాలు.. రచ్చరచ్చే. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నియమితులైన సందర్భంగా కార్యకర్తలు ఆత్మీయ సమావేశం.. ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే సమావేశంలో కాంగ్రెస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది.
ఐతే కొండా సురేఖ మురళి దంపతులు ఈ సమావేశానికి హాజరుకాలేదు.. వారిని ఇంటికి వెళ్లి ఆహ్వానించలేదని అలక వహించారట.. డీసీసీ అధ్యక్షురాలిగా నియామకమైన తర్వాత కనీసం మర్యాద పూర్వకంగా కొండా దంపతులను కలవలేదని వారి వర్గీయులు ఆరోపిస్తున్నారు.. మరోవైపు పరకాల నుండి టిక్కెట్ ఆశిస్తున్న ఇనుగాల వెంకటరామిరెడ్డి – కొండా వర్గీయులు ఇదే మీటింగ్ లో ఘర్షణపడ్డారు.. కొండా వర్సెస్ ఇనుగాల మధ్య ఆధిపత్య పంచాయతీకి ఈ మీటింగ్ ను వేదికగా మార్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని గాడిలో పెట్టేందుకు నూతన అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ చేస్తున్న ప్రయత్నాలకు ఆదిలోనే బ్రేకులు పడుతున్నాయి.. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో ఆదిపత్య పోరే ఇందుకు కారణమంటున్నారు. ఐతే నేతలు మాత్రం మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని… తామంతా ఒక్కటే అని ఐక్యతా రాగాన్ని వినిపిస్తున్నారు…అయితే వీళ్ళింతే మారారని కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం