Polavaram War: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పోలవరం పంచాయితీ.. ఎత్తు పెంపుపై వివాదం..

|

Jul 19, 2022 | 2:09 PM

Polavaram: ప్రస్తుతం వచ్చిన వరదలతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.

Polavaram War: తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి పోలవరం పంచాయితీ.. ఎత్తు పెంపుపై వివాదం..
Polavaram Dam
Follow us on

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరంపై మళ్లీ పంచాయతీ మొదలైంది. భద్రాచలం దగ్గర వరద ఉధృతితో పోలవరం ఎత్తు తగ్గించాలన్న డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తెచ్చింది తెలంగాణ. ప్రస్తుతం వచ్చిన వరదలతో ఈ అంశం రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ వేడిని పెంచుతోంది. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. వరదలు వచ్చినప్పుడల్లా పోలవరం ఎత్తుపై రాజకీయం చేయడం సరికాదన్నారు అంబటి. పోలవరం పూర్తయితే భద్రాచలం ఎప్పుడూ వరదలోనే ఉంటుందన్నారు తెలంగాణ మంత్రి అజయ్‌కుమార్‌. 45.5 అడుగుల ఎత్తులో వరద టెంపుల్‌ టౌన్‌లో నిలిచి ఉంటుందని చెప్పారు. పోలవరంపై అన్ని సర్వేలు చేసిన తర్వాతే కేంద్రం అనుమతులు ఇచ్చిందన్నారు ఏపీ మంత్రి అంబటి.

పోలవరంలో గేట్లు ఆలస్యంగా ఎత్తడం వల్లే ఈసారి వరద తీవ్రత పెరిగిందని విమర్శించారు పువ్వాడ. వరద వచ్చినప్పుడల్లా ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి పోలవరం ఎత్తు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు భద్రాచలాన్ని అనుకుని ఉన్న ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారు పువ్వాడ అజయ్‌కుమార్‌. వరద వచ్చిన ప్రతిసారీ ఆ ఐదు గ్రామాల్లో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే చట్టాన్ని మార్చి ఎటపాక, పురుషోత్తపట్నం, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల పంచాయతీలను తెలంగాణలో కలపాలని డిమాండ్‌ చేశారాయన.

తెలంగాణ మంత్రి పువ్వాడ చేసిన వాదనను తోసిపుచ్చారు అంబటి రాంబాబు. పోలవరంలో 45.72 అడుగుల ఎత్తులో నీరు ఉన్నా భద్రాచలానికి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్రతిసారీ పోలవరం ఎత్తుపై వివాదం రేపడం సరికాదన్నారు. ఏదైనా ఉంటే కేంద్రంతోనే చర్చించుకోవాలని తెలంగాణకు సూచించారు అంబటి.

ఇవి కూడా చదవండి

కొత్త ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్నారు టీఆర్‌ఎస్‌ ఎంపీ వెంకటేష్‌. CWC డిజైన్‌ ప్రకారమే పోలవరం నిర్మాణం జరుగుతోందన్నారు ఏపీ మంత్రి బొత్స.

మరిన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వార్తలు..