
తెలంగాణ అసెంబ్లీలో జల జగడం నెలకొంది. కృష్ణా జలాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నెలకొంది. హరీష్ కౌంటర్స్‌కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఉత్తమ్, రేవంత్‌రెడ్డి. కృష్ణా జలాలపై అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి కాంగ్రెస్ కట్టబెట్టిందంటూ బీఆర్ఎస్.. లేదు లేదు.. అంతా మీరే చేశారంటూ లెక్కలతో సహా బయటపెట్టింది కాంగ్రెస్. నిరాధార ఆరోపణలు చేయడం లేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్.. కేఆర్ఎంబీ, కేంద్ర జలవనరుల కార్యదర్శి, తెలంగాణ జలవనరుల కార్యదర్శి, ఏపీ జలవనరుల కార్యదర్శి తదితరులు సంతకాలు పెట్టిన సమావేశం మినట్స్ ఆధారంగా మాట్లాడుతున్నామన్నారు. రెండు సమావేశాల్లోనూ తెలంగాణ, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శులు కేఆర్ఎంబీకి అప్పగించినట్లుగా సంతకాలు చేశారన్నారు. కృష్ణా ప్రాజెక్టులను KRMBకి అప్పజెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అసలు కేఆర్ఎంబీని కేంద్రానికి అప్పగించింది ఎవరు? అని ప్రశ్నించారు ఉత్తమ్. బీఆర్‌ఎస్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. ఎవరో రాసిచ్చిన మినిట్స్ చూసి మాపై నిందలు వేయడం తగదన్నారు మంత్రి ఉత్తమ్. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం వహించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని మండిపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. రాష్ట్రానికి అన్యాయమంతా కేసీఆర్ హాయాంలోనే జరిగితే కాంగ్రెస్‌పై నిందలేంటని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతానికి బీఆర్ఎస్ పాలనలో తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఈ తరహా అన్యాయం జరగలేదని చెప్పారు. లేనిపోని ఆరోపణలతో రైతులను పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి. ప్రాజెక్టులను మోదీ గుంజుకుంటున్నారంటున్న బీఆర్ఎస్‌కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్.. అలాంటప్పుడు నల్గొండలో దీక్ష ఎందుకు? దమ్ముంటే ఢిల్లీలో చేయాలంటూ సవాల్ చేశారు. అసలు తెలంగాణ జల హక్కులను ఏపీకి కట్టబెట్టిన బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటుగా ఉందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్‌రెడ్డి.
మరింది తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..