Terror Links: హైదరాబాద్ టెర్రర్ లింక్స్ ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. BJP-BRS మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆరోపిస్తున్నారు కమలనాథులు. నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు. భాగ్యనగరంలో ఉగ్ర అలజడిపై ఓవైపు దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. అటు రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశంపై మాటల యుద్దానికి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే పాతబస్తీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది బీజేపీ. నగరం నడిబొడ్డున ఇంత జరుగుతుంటే రాష్ట్ర నిఘా వ్యవస్థ ఏం చేస్తోందని సూటిగా ప్రశ్నిస్తున్నారు కమలనాథులు.
అయితే బీజేపీ నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చారు బీఆర్‌ఎస్ నేతలు. తెలంగాణ పోలీసులిచ్చిన సమాచారంతోనే టెర్రరిస్టుల జాడ తెలిసిందన్నారు. అసలు నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదంటూ మండిప్డడారు. ఉగ్రవాద కదలికలపై దర్యాప్తు చేస్తున్నామని.. ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చెప్పారు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ. అందరి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. ఇక మొత్తానికి పాతబస్తీ ఇష్యూ మరోసారి రాష్ట్ర రాజకీయాలను హీటెక్కిస్తోంది. MIMతో దోస్తీని ప్రస్తావిస్తూ.. అధికార బీఆర్ఎస్‌ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ. తొమ్మిదేళ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెడుతున్నారంటూ గట్టిగానే బదులిస్తోంది గులాబీదళం.
ఇదిలా ఉండగా ఎక్కడో భూపాల్‌లో నివసించే వాళ్ళు హైదరాబాద్‌కు ఎందుకు వచ్చారు..? వారి టార్గెట్ ఏంటి..? అరెస్టైన వారు టెర్రర్ యాక్టివిటీస్ నిర్వహించారా..? లేదంటే కేవలం అనుమానితులేనా..? మతమార్పిడిలు మాత్రమే కాక యువతను ఉగ్రవాద బాటపట్టించడం.. అనంతగిరి అడవుల్లో టెర్రర్ ట్రైనింగ్ ఇవ్వడం.. ఇవన్నీ నిజంగా నిజాలేనా..? అనే కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఇంకా పక్కా ఆధారాలతో ఏటీఎస్ దర్యాప్తు స్పీడందుకుంది. ఇక ఈ తరుణంలో ఎవరి వాదన ఎలా వున్నా మతమార్పిడి నీడలో ఉగ్రజాడల డొంక కదిలింది. కేరళ స్టోరీని తలదన్నేలా ది హైదరాబాద్ స్టోరీ ప్రకంపనలు రేపుతోందిప్పుడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..