
జడ్చర్ల, ఆగస్ట్ 15: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని మాచారం వద్ద శుక్రవారం (ఆగస్టు 15) ఉదయం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేటి ఉదయం 5.30 గంటల ప్రాంతంలో మాచారం బ్రిడ్జిపై ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వస్తున్న వోల్వో బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
కడప నుంచి హైదరాబాద్‌కు 35 మంది ప్రయాణికులతో వోల్వో ట్రావెల్స్ బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం ధాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. బస్సు లారీలోకి దూసుకెళ్లడంతో డ్రైవర్ తల తెగి లారీపై పడింది. డ్రైవర్ వెనక కూర్చున్న ఇద్దరు మహిళలు కూడా మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో అతి కష్టంపై మృతదేహాలను వెలికితీశారు. మృతులను కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన లక్ష్మీదేవి (65), ఆమె కోడలు రాధిక (45)గా గుర్తించారు. కుటుంబ సమేతంగా కడపలో ఓ శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో సుమారు 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. బస్సు, లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారి 44పై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. స్థానిక పోలీసులు వాహనాలను ప్రొక్లెయిన్‌తో పక్కను జరిపి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.