ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి పంజాకు మరో ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఇంతకాలం మేత కోసం అడవులకు వెళ్లి పశువుల మీద దాడి చేసిన టైగర్స్.. ఇప్పుడు ఏకంగా మనుషులపైనే ఎటాక్ చేస్తున్నాయి. లేటెస్ట్‌గా కుమ్రంభీం జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్ ఏజెన్సీలో సిడాం భీమ్ అనే రైతును పొట్టనబెట్టుకున్నాయి. పొల్లాల్లో నెత్తుటిమరకలతో అటవీ సమీప గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకీడుస్తున్నారు. పులుల్ని పట్టుకోండి సామీ అంటూ ఫారెస్ట్ అధికారుల్ని వేడుకుంటున్నారు.
తాడోబా, అందేరి అభయారణ్యాల నుంచి పులులు వలస వస్తున్నాయి. ఖానాపూర్ గ్రామంలో రైతును చంపేసిన పులి మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యం పరిధిలోని రాజోరా అడవుల నుంచి వచ్చినట్టు ఫారెస్ట్ అధికారులు అనుమానిస్తున్నారు. స్పాట్ జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోనే రాజురా అటవీ ప్రాంతం ఉంది. ఖానాపూర్ పశువుల కాపరులు, గ్రామస్థులు స్థానిక అటవీ ప్రాంతంలో మూడు రోజుల నుంచి పులి కనిపిస్తుందని అంటున్నారు. అయినా అక్కడి అటవీ అధికారులు కనీస జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవున్నాయి.
మహారాష్ట్ర తిప్పేశ్వర్ ఫారెస్ట్ పెన్‌గంగా మీదుగా జైనథ్ ప్రాంతాల నుంచి పులులు ఆదిలాబాద్‌కు వస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మహారాష్ట్రలోని తడోబా, రాజోరా, సెంట్రల్ చాంబతో పాటు ఆసిఫాబాద్ టైగర్ కారిడార్ సమీపంలోనూ కనిపించాయి. అయితే నిన్న రైతు సిడాం భీమ్‌పై దాడి జరిగింది కూడా ఇక్కడే. అటు చత్తీస్‌గఢ్ నుంచి పులుల వలస కొనసాగుతోంది. దేవులమర్రి, గూడెం, బెజ్జూరు, కోటపల్లి నుంచి మంచిర్యాల జిల్లాలోనూ అక్కడక్కడ పులుల సంచారం కనిపిస్తోంది.
వాంకిడి, ఆసిఫాబాద్, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్, పెంచికల్‌పేట్, దహెగాం మండలాల్లో పులులు సంచరిస్తున్నాయి. వాంకిడి ప్రాంతంలో ప్రజలను మరింత అప్రమత్తం చేసి ఉంటే ఈ మరణం చోటుచేసుకునేది కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.
అటవీ సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. 2020 నవంబరు 11న పులి ఇదే జిల్లా దహెగాం మండలంలోని దిగిడ గ్రామానికి చెందిన 19ఏళ్ల విఘ్నేష్‌పై దాడి చేసి చంపేసింది. 18 రోజుల తర్వాత నవంబరు 29న పెంచికల్‌పేట్ మండలం కొండపల్లి గ్రామానికి చెందిన 16ఏళ్ల నిర్మలపై పంజా విసిరి బలి తీసుకుంది. నిన్న వాంకిడి మండలంలోని ఖానాపూర్‌లో సిడాం భీము అనే రైతు బెబ్బులి దాడిలో మరణించడంతో మృతుల సంఖ్య మూడుకి చేరింది.
పులులు ఈ సమయంలో ఆడ తోడు వెతుక్కుంటూ వెళ్తుంటాయని, చాలా కోపంగా ఉంటాయని అంటున్నారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ చుట్టూ తిప్పేశ్వర్, తాడోబా, ఇంద్రావతి అభయారణ్యాలు ఉండటం.. ఇక్కడ పులుల సంతతి ఏటికేడు పెరగడంతో కుమురం భీం, ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల వైపు ఇవి వస్తున్నాయి.
మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి, నెన్నెల మండలాల్లో, ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్, తాంసి మండలాల్లో ప్రజలకు కనిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు పులులు జతకట్టే సమయంలో అటవీ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని వాటి కదలికలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరం ప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. పత్తి ఏరడానికి రైతులు పంట చేల వైపు వెళ్తారు. ఈ సమయంలో అధికారులు జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే మరిన్ని ప్రాణాలు గాలిలో కలవడం ఖాయం.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి