వికారాబాద్ చౌడాపుర్‌లో పోస్ట్‌మ్యాన్ మితిమీరిన నిర్లక్ష్యం వెలుగుచూసింది. 2011 నుంచి పంపిణీ చెయ్యాల్సిన కార్డులన్నీ చెత్తపాలు చేశాడు సదరు పోస్ట్ మ్యాన్. 2వేల ఆధార్, PAN, ATMకార్డులు మూటగట్టి చెత్త కుప్పలో విసిరేశాడు. గమనించిన స్థానికులు వాటన్నింటిని సేకరించి గ్రామపంచాయితీ ఆఫీస్‌లో భద్రపరిచారు. తమకు సంబంధించిన కార్డుల కోసం చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి భారీగా వచ్చారు ప్రజలు. కొందరు వెతుక్కుని తమ కార్డులు తీసుకెళ్లారు. మిగతావాటిని కట్టులుకట్టి తహశీల్దార్‌కి అప్పగించారు. గ్రామాల సెక్రటరీల సాయంతో ఆ కార్డులను పంపిణీ చేస్తామని తహశీల్దార్ ప్రభులు చెప్పారు. గంటల తరబడి ఆధార్ సెంటర్లలో నిలుచుని.. ఆయా కార్డుల కోసం నమోదు చేయించుకుంటే.. వాటిని ఇవ్వకుండా చెత్తకుప్పలో పడేయడంతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రప్రభుత్వ ఉద్యోగిని… ఎవడు ఏం చేస్తాడులే అని అనుకున్నాడో ఏమో పోస్ట్‌మ్యాన్ నర్సింహులు. 2011 నుంచి ఠంచనుగా జీతం అయితే తీసుకుంటున్నాడు గానీ… పంచాల్సిన ఐడీ కార్డులను మాత్రం అప్పటి నుంచి తన దగ్గరే పెట్టుకున్నాడు. చివరికి ఇవాళ చెత్తకుప్పలో పడేశాడు. ఆఫీసులో పేరుకుపోయిన ఏళ్లనాటి ఆధార్, పాన్, ATM కార్డులు, ఇతర డాక్యూమెంట్స్ ఎవరికీ అనుమానం రాకుండా.. గ్రామపంచాయతీ ట్రాక్టర్‌లో వేయగా.. వాటిని ఆ ట్రాక్టర్ తీసుకెళ్లి చెత్తకుప్పలో పడేశాడు. అటుగా వెళ్లిన కొంతమంది స్థానికులు.. వాటిని గమనించి కంగుతిన్నారు.
2వేల కార్డులను చూసి ఆశ్చర్యపోయిన స్థానికులు.. వాటిని తీసుకెళ్లి దాచిపెట్టారు. చుట్టుపక్కల వాసులు వచ్చి.. ఎవరి కార్డులను వాళ్లు తీసుకెళ్లారు. మిగిలిపోయిన వాటిని గ్రామాల్లోని సెక్రటరీల సాయంతో పంచుతామంటున్నారు తహశీల్దార్ ప్రభులు. ఈ ప్రక్రియ సరే.. ఇంతకీ అసలు ఆ పోస్ట్‌మ్యాన్ నర్సింహులును ఏం చెయ్యాలి? అప్పనంగా ప్రజాధనాన్ని జీతంలా బొక్కాడు గానీ.. చేయాల్సిన పని మాత్రం చెయ్యలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…