
విజయశాంతి ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకొచ్చేది రాములమ్మ అనే సినిమా. ఇందులో తన వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల మదిని దోచుకున్నారు. ప్రతి ఒక్క మహిళకు స్పూర్తిగా నిలిచారు. అయితే సినిమాలకు కాస్త విరామం ఇచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంలో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ముందుగా మెదక్ నా ఊపిరి అని చెబుతూ ప్రజల్లోకి వెళ్లారు. ఆ తరువాత తల్లి తెలంగాణ అనే పార్టీని స్థాపించారు. ఆశించినంత ఫలితం రాకపోవడంతో బీఆర్ఎస్‌లో చేరారు విజయశాంతి.
ఆ తరువాత కాంగ్రెస్లో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించాలనుకున్నారు. అక్కడ సరైన గుర్తింపు లభించకపోవడం, నేతల ఆధిపత్య పోరుతో పొసగలేక బీజేపీ కండువా కప్పుకున్న విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం గత కొంత కాలంగా ఆ పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆమె అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే త్వరలో బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లోకి చేరబోతున్నట్లు మల్లు రవి శనివారం ప్రకటించారు. అయితే ఆమెకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తున్నారన్న మాటపై సమాధానం ఇవ్వలేదు. ఆమెకు ఏ పదవి కేటాయించాలి అన్నది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. కాగా గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన విజయశాంతికి కమలం పెద్దలు షాకిచ్చారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో ఆమె పేరు తప్పకుండా ఉంటుందని ఆశించినప్పటికీ అందులో పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తిరిగి కాంగ్రెస్‌లోనే చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాగా మల్లు రవి చేసి వ్యాఖ్యలను ఖండించారు విజయశాంతి వర్గం. ఆమె ప్రస్తుతం ఏ పార్టీ మారే ఆలోచనలో లేనట్లు తెలిపారు.
ఈ రోజు తెలంగాణకు మోదీ రాక సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఎయిర్ పోర్టుకు బయలుదేరినట్లు తెలిపారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ సభకు కూడా ఆమెకు ఆహ్వానం అందినట్లు ఆమె కార్యకర్తలు స్పష్టం చేశారు. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన బీజేపీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉండటంతో మల్లు రవి చేసిన వ్యాఖ్యలకు బలం చేకూరినట్లైంది. తాజా పార్టీ మార్పు వివరాలపై విజయశాంతి స్పందిస్తూ అలాంటిదేమీ లేదని సున్నితంగా తోసిపుచ్చారు. మోదీని ఆహ్వానించేదుకు మాత్రమే వచ్చాను సభకు వెళ్లడం లేదని సమాధానాన్ని ఇచ్చారు. సభకు హాజరవుతున్నారా..? అన్న ప్రశ్నకు లేదు వేరే మీటింగ్‌కి వెళ్తున్నా అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..