
కోతుల బెడద ఎక్కువగా ఉందని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. అభం శుభం తెలియని అమాయక మూగ జీవాలపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కర్కశంగా ప్రవర్తిస్తూ మూగ జీవాలను చంపేశారు. ఆ తర్వాత గ్రామంలోని చెరువు కట్ట పక్కన సంచుల్లో మూట కట్టి పడేశారు. చివరికి ఆ కోతుల కళేబరాలు లభ్యం కావడంతో ఆ గ్రామంలో కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కర్రాలపాడు గ్రామంలో గత కొద్ది నెలలుగా కోతులు బెడద ఎక్కువగా ఉంది. దీంతో కోతులను పట్టేందుకు కొందరు రైతులు ఒక మనిషిని తీసుకువచ్చారని.. అయితే ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి 30 కోతులుకు అరటి కాయలలో విషపు గుళికలు పెట్టి చంపినట్టు ఆ గ్రామంలో పుకార్లు షికార్లు చేస్తుంది.
అయితే నాలుగు రోజుల తరువాత ఆ గ్రామ శివారులోని బోగం చెరువు కట్ట పక్కన సంచుల్లో కోతులు కళేబరాలను ఫారెస్ట్ సిబ్బంది గుర్తించడంతో ఈ విషయం బయటపడింది. ఆ గ్రామ సర్పంచ్‌ను వివరణ కోరగా తమ గ్రామంలో కోతులు బెడద ఉన్న మాట వాస్తవమేనని, తాము కోతులను చంపలేదని, గిట్టని వారు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అంటున్నారు. కోతులను చంపి సంచుల్లో మూట కట్టి చెరువు కట్ట పక్కన పడేసారనే వార్త ఆ నోట, ఈ నోటా తెలియడంతో పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని కళేబరాలను వెలికి తీసి పంచాయితీ సిబ్బంది అధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. ఈ చుట్టు ప్రక్కల గ్రామాల్లో అడవులు ఎక్కువ..కోతుల బెడద కూడా ఎక్కువే. ప్రతి రోజూ గ్రామస్థులు ,రైతులు వీటి బారిన పడుతున్నారు. అయితే కోతులను పట్టుకొని కొందరు దూరంగా అడవుల్లో వదిలేస్తుంటారు.
ఇక మరికొందరు ఇళ్ల మధ్య కోతుల బెడద నుంచి ఏదో విధంగా రక్షణ ఏర్పాట్లు చేసుకుంటారు. కానీ ఇలా నోరు లేని.. మూగ జీవాలు కోతులపై విష ప్రయోగం చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ అమానుషానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఇదిలా ఇటీవల చాలా గ్రామాల్లో కోతుల బెడత ఉంది. ఆహారం కోసం కోతులు జనావాసాలకు రావడం పెరిగిపోయింది. ఇప్పటికీ కూడా కొన్ని చోట్ల కోతులను చంపేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. మరోవైపు మూగజీవాలను చంపేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మూగజీవాలను చంపకుండా అడవులో వదిలేయాలని సూచినలు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం