
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. కొందరు వినూత్నంగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రజల విశ్వాసం గెలుచుకోవడానికి సాధారణ వాగ్దానాలకతీతంగా ఒక ధైర్యమైన భిన్నమైన పంథాను ఎంచుకున్నాడు ఓ యువ అభ్యర్థి. అతడి వినూత్న ప్రచారమేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల యువతరం పోటీలోకి దిగుతోంది. వీరు వినూత్న రీతిలో ప్రచారం కొనసాగిస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన గుగులోతు జైపాల్ నాయక్ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. అందరిలా కాకుండా భిన్నమైన రీతిలో ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. జైపాల్ నాయక్ ప్రజల విశ్వాసం గెలుచుకోవడానికి సాధారణ వాగ్దానాలకతీతంగా ఒక ధైర్యమైన భిన్నమైన పంథాను ఎంచుకున్నాడు. ప్రస్తుత ఎన్నికల సాంప్రదాయంలో నోట్ల కట్టలు, మాయ మాటలకు అలవాటైపోయిన ప్రజలకు ఈసారి వేరుగా నడిచే అభ్యర్థి కనబడ్డాడు. పదవిని అడ్డుపెట్టుకుని అక్రమంగా ఒక్క రూపాయి సంపాదిస్తే నా ఆస్తిని గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకోవచ్చని బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చాడు. ఆ బాండ్ పేపర్ ను గ్రామ ఓటర్లకు చూపుతూ ఓట్లు అడుగుతున్నాడు జైపాల్ నాయక్. సాధారణంగా రాజకీయ వాగ్దానాలు.. గాలిలో కలిసి పోతుంటాయి. కానీ జైపాల్ నాయక్ వాటిని కాగితంపై కట్టిపడేస్తూ, నైతికంగా ఓటర్లను ఆకర్షిస్తున్నాడు.
ఇది కేవలం ప్రచార స్టంట్ మాత్రమేనా లేక నిజంగా భిన్నమైన నాయకత్వమా అని గ్రామ ప్రజల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. జైపాల్ నాయక్ బాండ్ పేపర్ ప్రచారాన్ని కొందరు నమ్ముతుంటే, మరికొందరు ఈ చర్యను ఎన్నికల గారడిగా భావిస్తున్నారు. బాండ్ పేపర్ రాసి ఇచ్చి ఇంత ధైర్యంగా ఓట్లు అడగడం మొదటిసారిగా చూశామని గ్రామస్థులు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులందరూ ఇలా బాధ్యతగా వాగ్దానం చేయాలని యువ ఓటర్లు బావిస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో నేతలు చేసే వాగ్దానాలను ప్రజలు నమ్మడం లేదని, ప్రజల నమ్మకాన్ని చూరగోనేందుకే అక్రమ సంపాదనపై జప్తు చేసుకునే అధికారాన్ని బాండ్ పేపర్ రూపంలో రాసిచ్చానని జైపాల్ నాయక్ చెబుతున్నాడు. ఈ బాండ్ పేపర్ ప్రచారంతో గ్రామస్తులు ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
జైపాల్ నాయక్ చేసిన ఈ వినూత్న ప్రచారం స్థానిక ఎన్నికల రాజకీయాల్లో కొత్త చరిత్రకు నాంది పలికేలా కనిపిస్తోంది. ఏదేమైనా బాండ్ పేపర్ తో వినూత్న ప్రచారం సూర్యాపేట జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..