Minister Kishan Reddy: తెలంగాణ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్.. లెక్కలు చెబుతూ మరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి..

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల పునరుజ్జీవనానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీస్ మిషన్ క్రింద వరంగల్, కరీంనగర్ పట్టణాలకు..

Minister Kishan Reddy: తెలంగాణ సర్కార్‌పై కిషన్ రెడ్డి ఫైర్.. లెక్కలు చెబుతూ మరీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేంద్రమంత్రి..
Union Minister Kishan Reddy
Follow us

|

Updated on: Jan 08, 2023 | 5:10 PM

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాల పునరుజ్జీవనానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే స్మార్ట్ సిటీస్ మిషన్ క్రింద వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఇప్పటికే రూ. 392 కోట్లు విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఇక అమృత్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన 12 పట్టణాలకు రూ. 833.36 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. అమృత్ 2.0 లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంపికైన 143 పట్టణాలలో రూ.2,780 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రానికి 2,49,465 ఇళ్లు మంజూరు చేయగా.. వీటి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే రూ. 3,128.14 కోట్లు విడుదల చేయడం జరిగిందని వెల్లడించారు కేంద్ర మంత్రి. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ కిషన్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ ప్రకటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి..

దేశంలో వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచి, వాటిని ప్రజల జీవనానికి అనుకూలంగా తయారు చేయాలని సంకల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. 25 జూన్, 2015 న జాతీయ స్మార్ట్ సిటీస్ మిషన్, అటల్ మిషన్ ఫర్ రెజువినేషన్ & అర్బర్ ట్రాన్స్ఫర్మేషన్ (AMRUT) & ప్రధానమంత్రి ఆవాస్ యోజన – అర్బన్ (PMAY-U) వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను అన్నింటినీ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమలు పరిచే విధంగా ప్రణాళికలను రూపొందించడం జరిగింది.

స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 100 నగరాలను ఎంపిక చేసి, ఆయా నగరాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుండి వరంగల్, కరీంనగర్ పట్టణాలను ఎంపిక చేయడం జరిగింది. స్మార్ట్ సిటీస్ మిషన్ కార్యక్రమం కింద వరంగల్ పట్టణానికి రూ. 500 కోట్లను, కరీంనగర్ పట్టణానికి రూ. 500 కోట్లను మొత్తంగా రూ. 1,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే, స్మార్ట్ సిటీస్ మిషన్ పథకం క్రింద 50:50 రేషియోలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ద్వారా వీటికి ప్రత్యేక నిధులను కేటాయించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తన తదుపరి విడత నిధులను విడుదల చేయాలంటే, రాష్ట్ర ప్రభుత్వం తన మ్యాచింగ్ గ్రాంట్ నిధులను స్మార్ట్ సిటీకి ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉంటుంది. సంబంధిత స్మార్ట్ సిటీకి విడుదల చేసిన మొత్తం నిధులలో (కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు + రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు) కనీసం 75% నిధులను వినియోగించుకుని ఖర్చు చేసి ఉండాలి.

స్మార్ట్ సిటీస్ మిషన్ క్రింద వరంగల్, కరీంనగర్ పట్టణాలకు ఒక్కో పట్టణానికి రూ. 196 కోట్ల చొప్పున మొత్తం రూ. 392 కోట్ల నిధులను 2020-21 నాటికే విడుదల చేయగా అందుకు సమానమైన మ్యాచింగ్ గ్రాంట్ నిధులను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. వరంగల్ పట్టణానికి రూ. 50 కోట్లను, కరీంనగర్ పట్టణానికి రూ. 186 కోట్లను మొత్తంగా రూ. 236 కోట్లను మాత్రమే తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను విడుదల చేయడంలో ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆయా పట్టణాల అభివృద్ధికి సహకరించని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం విడుదల చేసిన నిధులను ఆయా నగరాల మునిసిపల్ కార్పొరేషన్లకు బదిలీ చేయడంలో కూడా అలసత్వం వహించింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన మ్యాచింగ్ గ్రాంట్ నిధులను సకాలంలో విడుదల చేసి ఆయా పట్టణాలలో అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లయితే, కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవలసిన మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

స్మార్ట్ సిటీస్ మిషన్ క్రింద వరంగల్, కరీంనగర్ పట్టణాలకు విడుదల చేసిన నిధుల వివరాలు..

Smart Cities

అమృత్ పథకానికి సంబంధించిన వివరాలు..

అమృత్ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఆయా పట్టణాలలో పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది. అమృత్ పథకంలో భాగంగా ఎంపికైన పట్టణాలలో సామర్థ్యం పెంపుదల, సంస్కరణల అమలు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల, సెప్టేజీ నిర్వహణ, తుఫాను నీటి పారుదల, పట్టణ రవాణా, ఉద్యానవనాల అభివృద్ధి వంటి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోంది. ఈ పథకం క్రింద తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన 12 పట్టణాలకు రూ. 833.36 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

ఆయా పట్టణాలకు విడుదల చేసిన నిధుల వివరాలను ఇవి..

Smart Cities 2

అమృత్ పథకంలో భాగంగా 500 పట్టణాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషి చేసిన కేంద్ర ప్రభుత్వం, దేశంలోని మిగతా పట్టణాలన్నింటిలో కూడా మురుగునీటి నిర్వహణ, శుభ్రమైన త్రాగునీటి సరఫరా వంటి వ్యవస్థలను అభివృద్ధి చేయడం కోసం 2021-22 నుండి 2025-26 వరకు 5 సంవత్సరాల నిర్ధిష్ట కాలపరిమితితో అక్టోబర్, 2021లో అమృత్ 2.0 పథకాన్ని ప్రారంభించింది. అమృత్ 2.0 పథకం క్రింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 143 పట్టణాలను ఎంపిక చేసి వాటికి నిధులను కూడా కేటాయించారు. ఈ 143 పట్టణాలలో రూ. 2,780 కోట్లతో మురుగునీటి నిర్వహణ, శుభ్రమైన త్రాగునీటి సరఫరా వంటి వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నారు. అందులో భాగంగా ప్రాజెక్టుల డీపీఆర్ లు అందించటానికి ఇప్పటికే రూ. 100 కోట్ల నిధులను విడుదల చేశారు. డీపీఆర్ లు పొందిన వెంటనే ఆయా పట్టణాలలో పనులు ప్రారంభించటానికి అవసరమైన నిధులను విడుదల చేస్తారు.

సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో..

దేశంలోని ప్రతి కుటుంబం కలలు కనే సొంతింటి కలను సాకారం చేయాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘ప్రధానమంత్రి ఆవాస్ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం క్రింద కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రూ. 4,465.81 కోట్లను మంజూరు చేయగా.. ఇప్పటి వరకు రూ. 3,128.14 కోట్లను విడుదల చేశారు. ఈ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి 2,49,465 ఇళ్లను మంజూరు చేయగా, 2,39,422 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో 2,15,443 ఇళ్ళు నిర్మాణం పూర్తి అయినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేపట్టిన ఇళ్ళ నిర్మాణ పనులకు సంబంధించి నివేదికల లెక్కలకు, వాస్తవిక లెక్కలకు పొంతన లేకుండా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదలు ఇప్పటికీ సొంతింటి కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరిట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలస్యమే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని నమ్మబలికిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా వేగవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం క్రింద ఇచ్చిన నిధులను కూడా సరైన రీతిలో వినియోగించుకోవడంలో విఫలమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. పేదల కలలను కలలుగానే మిగిలిపోవటానికి కారణమవుతోంది. సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి గతంలో రూ. 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రూ. 3 లక్షలే ఇస్తామని చెబుతూ, అందులో కూడా అనేక నిబంధనలను పెట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత హామీలను ఇకనైనా కట్టిపెట్టి పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయటానికి సహాయపడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..