Kishan Reddy: బీసీలపై నిజంగా అంత ప్రేమ ఉంటే.. బీసీని సీఎం చేయాలి: కిషన్ రెడ్డి

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ గురించి కాంగ్రెస్ పార్టీపై తీవ్రంగా మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. బీసీల పేరుతో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్లు మళ్లించడం అన్యాయమని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం బీసీ రిజర్వేషన్లను వాడకూడదని హెచ్చరించారు. పూర్తి వివరాలు కథనం లోపల ...

Kishan Reddy: బీసీలపై నిజంగా అంత ప్రేమ ఉంటే.. బీసీని సీఎం చేయాలి: కిషన్ రెడ్డి
Union Minister Kishan Reddy

Updated on: Jul 25, 2025 | 6:59 PM

కామారెడ్డి బీసీ డిక్లరేషన్ హామిని కాంగ్రెస్ పార్టీ ఉల్లఘించి..  అసలు బీసీ వర్గాలకు కాకుండా ఇతర వర్గాలకు లాభం చేకూరేలా వ్యవహరిస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీసీ రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాలకు వినియోగించకూడదని సూచించారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని ప్రకటించినా.. అమలు విషయానికి వచ్చినప్పుడు అసలు బీసీలకు కాకుండా ముస్లిం వర్గాలకు మళ్లిస్తుండటం ఆందోళన కలిగించే అంశం అన్నారు. గతంలో 4% ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు రెండు మార్లు తిరస్కరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ రిజర్వేషన్లు సుప్రీంకోర్టు స్టే ఆధారంగా అమలవుతున్నాయని చెప్పారు. ఇప్పుడు అదే రిజర్వేషన్ శాతం 10కి పెంచే ప్రయత్నం జరుగుతోందని.. ఇది సాంప్రదాయ బీసీ వర్గాలకు అన్యాయం చేసే అంశం అని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

కాంగ్రెసు ఇటీవల విడుదల చేసిన కుల గణాంకాల్లో ముస్లిం వర్గాల సంఖ్యను బలవంతంగా బీసీల్లో చేర్చి.. బీసీల శాతాన్ని 56 నుంచి 46 శాతానికి తగ్గించినట్లు ఆరోపించారు. వాస్తవాలను దాచేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో 34 శాతం బీసీ రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించిన ఉదాహరణను గుర్తు చేశారు. ఆ సీట్లలో అధికశాతం AIMIM అభ్యర్థులే గెలిచారని ఆరోపించారు. ఇప్పుడు కూడా బీసీ కౌంటుగా ముస్లిం అభ్యర్థులకే అవకాశాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు..

బీసీ కమీషన్‌కు రాజ్యాంగ హోదా, కేంద్ర కేబినెట్‌లో పలువురు బీసీ మంత్రుల నియామకం, కుల గణాంకాల కోసం చట్టబద్ధమైన ప్రయత్నాలు చేస్తూ.. బీసీల అభ్యున్నతికి కేంద్రం కృషి చేస్తుందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఆయన కులాన్ని విమర్శించడం బాధాకరమని పేర్కొన్నారు.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో హైకోర్టు ఆదేశాలను పాటించాలని డిమాండ్ చేసిన కిషన్ రెడ్డి.. రిజర్వేషన్లు నిజమైన బీసీలకు వర్తించాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి బీసీల పట్ల నిజంగా ప్రేమ ఉంటే.. తన పదవికి రాజీనామా చేసి బీసీ వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించాలంటూ ఆయన సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..