బీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ తెచ్చిన ధరణితో రైతుల సమస్యలు తగ్గకపోగా, కొత్త సమస్యలు పుట్టుకొచ్చాయనన్నారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్థత కారణంగా రాష్ట్రంలో 75 లక్షల మంది రైతులు కష్టాలు పడుతున్నారని కిషన్ రెడ్డి అన్నారు. రైతులు, సామాన్య పౌరులు కష్టపడి సంపాదించిన భూములు, అక్రమ కబ్జాల నుంచి సురక్షితంగా ఉంటాయని భరోసా ఇవ్వడానికి బదులు ఒక ప్రైవేట్ కంపెనీ ప్రకటన వెనకాల దాచడం దారుణం అన్నారు. ఈరోజు దినపత్రికలో ఓ ప్రైవేటు కంపెనీ ద్వారా ప్రకటన విడుదల చేయించడం.. బీఆర్ఎస్ ప్రభుత్వ, కల్వకుంట్ల కుటుంబం.. వివాదాస్పదమైన ‘ధరణి’ అంశంలో తమకే తప్పు తెలియదని చేతులు కడుక్కున్నట్లు స్పష్టమవుతోందన్నారు. ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలకు తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. సమస్యలను పరిష్కరించకపోగా తప్పును ఇతరులపై నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవ చేశారు.
ధరణి పోర్టల్‌లో ఉన్న సమస్యలను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందన్న కిషన్ రెడ్డి.. ధరణి వ్యవస్థ ఇప్పటి వరకు ఉన్న సమస్యలను తీర్చకపోగా కొత్త సమస్యలను తీవ్రతరం చేసిందన్నారు. VRO లను ధరణి వ్యవస్థలోకి చొప్పించి.. వారి సహాయంతో ఈ వ్యవస్థను సరిగ్గా అమలుచేయాల్సి ఉండగా.. ఒకేసారి VRO వ్యవస్థను రద్దు చేయడంతోపాటుగా.. మానవుల ద్వారా తలెత్తే సమస్యలకు (హ్యూమన్ ఎర్రర్స్) సాంకేతికత సహాయంతో.. అన్ని సమస్యలను ఒకేసారి పరిష్కరించవచ్చనే కేసీఆర్ సర్కారు దుర్గార్గపు ఆలోచన కారణంగా ఈ సమస్య మరింత పెద్దదిగా మారిందన్నారు. కలెక్టర్లపై భారం మోపడం ద్వారా కొత్త సమస్యలు సృష్టించారు. దిద్దుబాటు చర్యలు తీసుకోవడంలో ఈ అసమర్థత పరిస్థితిని మరింత దిగజార్చింది. ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారత ప్రభుత్వం స్వామిత్వ యోజన ద్వారా పేదలకు అవాంతరాలు లేని ఆస్తి ధృవీకరణ పత్రాలను అందిస్తుంటే , బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం భూ సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతోందని విమర్శించారు. కనీసం ఇప్పుడైనా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలపై తప్పును నెట్టేయకుండా, ధరణిలో ఉన్న వైఫల్యాలను గుర్తించే బాధ్యతను స్వీకరించాలన్నారు.
గడిచిన 9 ఏళ్లుగా బీఆర్‌ఎస్ అప్రజాస్వామిక, నిరంకుశ శక్తిగా ఆవిర్భవించిందన్న కిషన్ రెడ్డి.. నిజామ్ పాలలను గుర్తుచేస్తోందని విమర్శించారు. ప్రజల కోసం పాటుపడే మీడియా సంస్థలను నిషేధించిన కేసీఆర్ నిర్ణయం ఇప్పటికీ గుర్తుందన్నారు. జర్నలిస్టులను 10 కిలోమీటర్ల మేర పాతిపెడతామన్న కేసీఆర్ బెదిరింపులను మర్చిపోలేదన్న కిషన్ రెడ్డి… కేసీఆర్ చర్యలన్నీ నిజాం పద్ధతులను కొనసాగించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని విమర్శించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..