AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌ అని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా తెలంగాణకే కాదు, యావత్‌ దేశానికి న్యాయం జరుగుతుందన్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రో రెండోదశ విస్తరణకు ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది ఆయన వెల్లడించారు.

దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Union Minister G. Kishan Reddy
Balaraju Goud
|

Updated on: Feb 01, 2026 | 8:00 PM

Share

దేశ హితం, ప్రజా సంక్షేమం కోసమే కేంద్ర వార్షిక బడ్జెట్‌ అని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఈ బడ్జెట్‌ ద్వారా తెలంగాణకే కాదు, యావత్‌ దేశానికి న్యాయం జరుగుతుందన్నారు. ఇక హైదరాబాద్‌ మెట్రో రెండోదశ విస్తరణకు ఇప్పటికే సూత్రప్రాయంగా కేంద్రం అంగీకారం తెలిపింది ఆయన వెల్లడించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించిన కేంద్ర బడ్జెట్ అభివృద్ధి మంత్రమని, ప్రతి విభాగం, అన్ని రంగాలను పరిగణనలోకి తీసుకున్నారని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు.

ఆర్థిక మంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర బడ్జెట్ 2026-27 భారతదేశ యువత, మహిళలు, రైతులను ప్రోత్సహిస్తూ.. ఆర్థిక వృద్ధి, జాతీయ అభివృద్ధిలో భాగం చేశారన్నారు. “ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో ఈ బడ్జెట్‌ను సమర్పించారు. అభివృద్ధి చెందిన భారతదేశం వైపు నిర్ణయాత్మక అడుగులు వేస్తున్నందుకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ఆయన అన్నారు.

మూడు లక్ష్యాల నుండి ప్రేరణ పొందిన ఈ బడ్జెట్, సమ్మిళిత, స్థిరమైన అభివృద్ధి కోసం బలమైన, స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను తెలియజేస్తుందని ఆయన అన్నారు. ఈ మూడు లక్ష్యాలలో వేగవంతమైన, స్థిరమైన ఆర్థిక వృద్ధిని కొనసాగించడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, అందరికీ వనరులు, అవకాశాలను మెరుగుపరిచేలా ఉందన్నారు. ఇది సహకార సమాఖ్యవాదాన్ని బలోపేతం చేస్తుందన్నారు. దేశ నిర్మాణంలో కీలక భాగస్వాములుగా రాష్ట్రాలకు అధికారం ఇస్తుందని ఆయన అన్నారు. దేశంలో మౌలికవసతులకు పెద్దపీట వేస్తూ.. రక్షణ రంగాన్ని మరింత శక్తివంతం చేసుకుంటూ.. రైల్వే, ఫార్మా, అగ్రికల్చర్, మహిళా సంక్షేమం వంటి అనే అంశాలకు ఈ బడ్జెట్ లో పెద్దపీట వేశారన్నారు.

బడ్జెట్‌లో విదేశీ పెట్టుబడులు, ఐటీ, క్రిటికల్ మినరల్ సెక్టార్‌లో, టాక్స్ విషయంలోనూ చాలా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. ఇది రిఫామ్స్ ఎక్స్ ప్రెస్ బడ్జెట్. తాత్కాలికంగా లబ్ధి చేకూర్చడం కంటే.. దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని కిషన్ రెడ్డి అన్నారు. అనేక దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయి. భారత్ మాత్రం అన్ని రాష్ట్రాలను కలుపుకుంటూ వికసిత భారతనిర్మాణం దిశగా దూసుకెళ్తోంది. ఈ బడ్జెట్ దేశాభివృద్ధికి బాటలు వేసే బడ్జెట్ అని పేర్కొన్నారు. సుస్థిరమైన ఆర్థిక ప్రగతి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా భవిష్యత్ తరాల్లో నమ్మకాన్ని కలిగించే బడ్జెట్. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా వేస్తున్న తొలి అడుగు ఈ బడ్జెట్. తెలంగాణ రాష్ట్రానికి ఈ బడ్జెట్ అనేక రకాలుగా మేలుచేస్తోంది.

తెలంగాణ రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పన్నుల వాటాగా రూ.29,280 కోట్లు రాగా.. అది 2026-27 సంవత్సరానికి 13.5% పెరుగుదలతో.. రూ.33,180 కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభం అవుతున్నాయి. ఇది మనమంతా గర్వించాల్సిన విషయమన్నారు. రింగ్ రోడ్డు, ఐటీ, బయోఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాల అభివృద్ధిలో దూసుకుపోతున్న హైదరాబాద్ నగరానికి.. మూడు హై స్పీడ్లు రావడం మరింత లాభం చేకూర్చుతుందని మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ బడ్జెట్‌‌లో ప్రకటించిన బయోఫార్మా SHAKTI (స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్‌మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్) కార్యక్రమం ద్వారా ఫార్మా కేపిటల్ గా, వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఉన్న మన హైదరాబాద్ నగరానికి చాలా మేలు జరగనుందని కేంద్ర మంత్రి వెల్లడించారు. బల్క్ డ్రగ్స్ అయినా, ఫార్ములేషన్ అయినా, వ్యాక్సిన్ రంగం అయినా.. హైదరాబాద్ నగరానికి మేలు జరుగుతుందన్నారు. దీని ద్వారా బయోలాజిక్స్, బయోసిమిలర్స్ (అడ్వాన్స్‌డ్ మెడిసిన్స్) ఉత్పత్తి దేశీయంగా పెరుగుతుంది. దీంతో.. ‘గ్లోబల్ బయోఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్’గా భారతదేశం ఎదగడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషించేందుకు వీలుకలుగుతుందన్నారు.

దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్ (VB GRAM G)కి సంబంధించిన నిధులు పెరిగాయి. ఎరువుల సబ్సిడీకి నిధులు గతంతో పోలిస్తే సుమారు రూ.7 వేల కోట్లు అదనంగా కేటాయించింది. మొత్తం రూ.1.26 వేల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం కేటాయించింది. ఇందులో సింహ భాగం తెలంగాణకే కేటాయించామని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ బడ్జెట్లో వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేశారు. టెక్స్-ఇకో కార్యక్రమం ద్వారా.. టెక్స్‌టైల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోటీకి తగ్గట్లుగా భారతీయ వస్త్ర పరిశ్రమ ఎదిగేందుకు కేంద్రం సహకరించనుంది. ఇందులో భాగంగా వరంగల్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ కు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

STEM (Science, Technology, Engineering & Medicine) కోర్సుల్లో ఉన్నత విద్య చదువుతున్న.. యువతులకు.. ల్యాబ్, క్లాసెస్ కారణంగా.. ఇళ్లకు దూరంగా ఉండి చదివే వారికి ఇబ్బంది అవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 33 జిల్లాలకు ఒక్కో గర్ల్స్ హాస్టల్ రానుంది. భారతదేశం ప్రపంచ ఐటీ సెక్టార్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. మరీ ముఖ్యంగా మన హైదరాబాద్.. దేశ ఐటీ సెంటర్ గా ఉంది. అందుకే ఈ రంగానికి మరింత ఊతమిచ్చేందుకు.. సేఫ్ హార్బర్ మార్జిన్ నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చిందని మంత్రి వెల్లడించారు.

మునిసిపల్ బాండ్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన కేంద్ర మంత్రి, హైదరాబాద్ వంటి నగరంలో వెయ్యి కోట్లకన్నా ఎక్కువ విలువైన మునిసిపల్ బాండ్స్ ను రైజ్ చేయగలిగితే.. దీనికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ.100 కోట్ల ప్రోత్సాహకాన్ని ఇస్తుందని తెలిపారు. తెలంగాణలో దాదాపు 32 పట్టణాలకు AMRUT కింద ప్రస్తుతం ఇస్తున్న రూ. 200 కోట్ల ప్రోత్సాహక పథకం కొనసాగనుందన్నారు. రైల్వేల మౌలికవసతుల విషయంలోనూ.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక వ్యూహంతో పనిచేస్తోంది. గతేడాది రూ.2.51 లక్షల కోట్లున్న రైల్వే బడ్జెట్ ను 10% పెంచి.. రూ.2.77 లక్షల కోట్లకు పెంచింది. దీని వల్ల.. రైల్వేల్లో కొత్త లైన్లు, సరికొత్త మౌలికవసతుల కల్పన తదితర అంశాల్లో మరింత పురోగతి సాధ్యం కానుంది. 42 రైల్వే స్టేషన్స్ రీమోడలింగ్ చేస్తున్నామన్నారు. భవిష్యత్తులో 3 హైస్పీడ్ రైళ్లువస్తున్నాయి. తెలంగాణలో రైల్వే నెట్ వర్క్ ను మరింత పెంచుకుంటామని మంత్రి పేర్కొన్నారు.

డేటా సెంటర్లలో అవసరమైన క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కు మద్దతివ్వడం, ఇందులో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం నడుంబిగించింది. ఏ విదేశీ కంపెనీ అయినా.. భారతీయ డేటా సెంటర్ల సర్వీసెస్ వాడితే.. ఆ కంపెనీకి.. 2047 వరకు టాక్స్ హాలిడేను ప్రకటించారు. దీని వల్ల భారతదేశంలోని డేటాసెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సాధ్యమవుతుంది. డేటా సెంటర్ల సర్వీసు ఉపయోగించుకునేందుకు విదేశీ కంపెనీలు పెరుగుతాయి. ఇప్పటికే వివిధ MNCలు హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరుల్లో డేటాసెంటర్లు ఏర్పాటుచేస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.

MSMEల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్ల బడ్జెట్ ను ప్రకటించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ గ్రోత్ ఫండ్ ద్వారా.. తెలంగాణలో ఉన్న 38 లక్షల MSMEలకు కూడా మేలు జరగనుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఖర్చు పెట్టుకునే నిధులపైన పన్నును 5% నుంచి 2%కు తగ్గించారు. ఈ బడ్జెట్ భవిష్యత్ తరాలకు మేలు జరిగే విధంగా రూపొందించిన బడ్జెట్ అన్న కిషన్ రెడ్డి.. ఎన్నికలకోసం రూపొందించిన బడ్జెట్ కాదన్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ కోసం.. ఈ బడ్జెట్లో MRTS, మెట్రో ప్రాజెక్టులకు.. దాదాపు రూ.28,740 కోట్లు కేటాయించారన్నారు. పట్టణాభివృద్ధి శాఖ వద్ద.. మెట్రో నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేందుకు తగినన్ని నిధులున్నాయి. ముందుగా హైదరాబాద్ మెట్రోపై.. రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టత తెచ్చుకుని, L&T తో విలీనంపై ఏర్పాటుచేసిన కమిటీ చర్చలను పూర్తిచేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ లావాదేవీలను పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత.. సరైన DPR సమర్పిస్తే.. దానికి తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి వివరించారు. ఇది దేశవ్యాప్తంగా ఉపాధి కల్పనను ప్రోత్సహించే బడ్జెట్. వ్యవసాయంతో కమర్షియల్ క్రాప్స్ ను ప్రోత్సహించడం, మహిళలను ప్రోత్సహించడం ఇవన్నీ ఉపాధి అవకాశాలను పెంచడమే. గ్రామీణ స్థానిక సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు ఈ బడ్జెట్లో నిధులు పెరిగాయన్నారు.

క్రిటికల్ మినరల్స్ విషయంలోనూ.. ఎనర్జీ, మినరల్ సెక్యూరిటీ కోసం చాలా నిర్ణయాలు తీసుకున్నారు. ఒడిశా, కేరళ, తమిళనాడు, ఆంధప్రదేశ్ రాష్ట్రాలను కలుపుకుంటూ.. రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రేర్ ఎర్త్, క్రిటికల్ మినరల్స్ ఎక్స్ ప్లొరేషన్, ప్రాసెసింగ్ కోసం.. ఈ కారిడార్ ఎంతో ఉపయుక్తం కానుంది. క్రిటికల్ మినరల్స్ పై మనం 98% దిగుమతులపై ఆధారపడుతున్నాం. దీన్ని తగ్గించుకుని ఆత్మనిర్భరత సాధించేందుకు ఈ నిర్ణయం ఎంతో ఉపయుక్తం కానున్నట్లు మంత్రి వివరించారు.

ఇదిలావుంటే, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రెండేళ్లకు పైగా ఆలస్యమైంది. సీరియల్ లాగా సాగదీస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కవిత తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపణ చేసింది. హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అన్న సందర్భంలో.. ఎవరు చేశారనే దానికన్నా.. ప్రభుత్వం ద్వారా జరిగిందనేది వాస్తవం. వారు, వీరు అని తేడా లేకుండా.. అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. చట్టం తన పని తాను చేసుకుపోవాలని కిషన్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అవినీతికి కొమ్ముకాస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శించారు. రెండు పార్టీలపై ప్రజల్లో విశ్వాసం పోయింది. తెలంగాణ ప్రజలు.. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారన్నారు.

కేసీఆర్ కుటుంబం డబ్బుల వాటాకోసం కొట్టుకుంటుంటే.. రేవంత్ సర్కారులో మంత్రులు డబ్బుల వాటాకోసం కొట్లాడుకుంటున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉద్యోగులకు ఇవ్వలేని దుస్థితి తెలంగాణలో ఉందన్నారు. తెలంగాణకు రూ.51వేల కోట్లు పెండింగ్ లో ఉన్నాయన్నారు. మునిసిపల్ ఎన్నికల్లో.. బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తుందనే మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…