
నల్లగొండ, సెప్టెంబర్ 06: వారిద్దరూ మంచి స్నేహితులు.. డిగ్రీ చదువుతున్నారు. హాస్టల్ లో ఉంటూ.. రోజూ కళాశాలకు వెళ్లి వస్తుంటారు.. ఏమైందో ఏమో తెలియదుగానీ.. ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని నల్లొండ జిల్లాలో చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలంలోని నక్కలపల్లికి చెందిన శివాని, అమ్మనబోలుకి చెందిన మనీష ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులు.. వారు నల్లగొండ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఎస్సీ సెకండ్ ఈయర్ చదువుతున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన ఇద్దరూ.. మంగళవారం తిరిగి నల్లగొండకు వచ్చారు.. ఆ తర్వాత ఎన్జీ కళాశాల వెనుక ఉన్న రాజీవ్ పార్కులోకి ఇద్దరూ వెళ్లి గడ్డి మందు తాగారు. అనంతరం పార్కు గేట్ వద్దకు వచ్చి బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి ఏం జరిగిందని ఆరా తీశారు.. ఇద్దరూ కూడా గడ్డి మందు తాగామంటూ చెప్పారు. వారు చెప్పింది విని.. వారంతా షాకయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు..
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం పోలీసులు విద్యార్థినులను నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.. వైద్యులు వెంటనే చికిత్స మొదలు పెట్టారు. అయితే ఇద్దరు విద్యార్ధినులు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం పరిస్థితి విషమించి చనిపోయారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.. ముందుగా పేరెంట్స్‌ను ఆరా తీయగా.. శివాని, మనీషాలు ఎగ్జామ్ ఉందని నల్లగొండకు వెళ్లారని శివానీ తండ్రి చెప్పారు. అయితే ఏం జరిగిందో మాకు తెలియదని.. ఇద్దరూ గడ్డి మందు తాగారని పోలీసులు ఫోన్ చేయడంతోనే మేము ఆసుపత్రికి వచ్చామని శివాని తండ్రి రోదించారు.
ఈ ఘటన సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.. అయితే వీరి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో శివాని, మనీష ఆత్మహత్యకు గల కారణాలపై అన్వేషిస్తున్నారు.. కాగా.. ఈ సంఘటన నల్లగొండ జిల్లాలో కలకలం రేపింది.
విద్యార్థినులు పురుగుల మందు తాగానికి గల కారణం ఏమిటీ..? వారిని ఎవరైనా బెదిరించారా..? లేక ఏదైనా జరిగిందా..? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇద్దరు విద్యార్థినుల మృతి.. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరు కుటుంబాలు కూడా కన్నీరు మున్నీరవుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..