Abhijit Reddy: 22 ఏళ్లకే గుండెపోటుతో హఠాన్మరణం! రూ.58 లక్షల ఫ్యాకేజీతో పెద్ద ఉద్యోగం.. చేరేలోపే మృత్యుఒడికి..

|

Sep 27, 2022 | 12:45 PM

తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (TSMSIDC) ఎండీ కె చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమారుడు కట్టా అభిజిత్‌రెడ్డి (22) గుండె పోటుతో మృతి చెందారు. నిండా 22 ఏళ్లు కూడా నిండని అభిజిత్‌రెడ్డి..

Abhijit Reddy: 22 ఏళ్లకే గుండెపోటుతో హఠాన్మరణం! రూ.58 లక్షల ఫ్యాకేజీతో పెద్ద ఉద్యోగం.. చేరేలోపే మృత్యుఒడికి..
Abhijith Reddy
Follow us on

TSMSIDC MD’s son Abhijith Reddy died: తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (TSMSIDC) ఎండీ కె చంద్రశేఖర్‌రెడ్డి పెద్ద కుమారుడు కట్టా అభిజిత్‌రెడ్డి (22) గుండె పోటుతో మృతి చెందారు. నిండా 22 ఏళ్లు కూడా నిండని అభిజిత్‌రెడ్డి నిన్న (సెప్టెంబర్‌ 26) రాత్రి టీవీలో భారత్‌-ఆస్ట్రేలియా క్రికెట్‌ మ్యాచ్‌ చూసి నిద్ర పోయాడు. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో గుండె నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందాడు. అభిజిత్‌ వరంగల్‌ నిట్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చదివారు. సౌదీ అరేబియాకు చెందిన చమురు కంపెనీ ‘సౌదీ అరామ్‌కో’లో ఏడాదికి 70 వేల డాలర్లు (దాదాపు రూ.58 లక్షలు) వార్షిక వేతనంతో ఉద్యోగం పొందారు. వచ్చే నెలలో ఆ ఉద్యోగంలో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. ఎదిగిన కొడుకు కళ్లముందే కుప్పకూలిపోవడంతో చంద్రశేఖర్‌రెడ్డి, ఆయన సతీమణి కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా చంద్రశేఖర్‌రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునూతల. అభిజిత్‌ అకాల మరణంపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఇతర అధికారులు చంద్రశేఖర్‌రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

చిన్న వయసులోనే హార్ట్‌ స్ట్రోక్‌ ఎందుకు?

ఈ మధ్య కాలంలో యుక్తవయస్కుల్లో గుండెపోటు సంభవించి చాలా మంది మృతి చెందారు. ఈ విధమైన మరణాలకు ప్రధాన కారణం గుండె కండరం మందమవడం. కొందరిలో పుట్టుకతోనే గుండె కొట్టుకోవడంలో తేడా ఉంటుంది. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో కూడా గుండె, కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టి మరణాలు సంభవిస్తున్నాయి. ఫిట్‌నెస్‌ స్టెరాయిడ్స్‌ వినియోగించే వారికీ ఈ విధమైన ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా శారీరక వ్యాయామం తక్కువగా ఉండే వారిలో సడెన్ హార్ట్‌ స్ట్రోక్‌ సంభవించే అవకాశం ఎక్కువ. అభిజిత్‌రెడ్డి మరణం కూడా ఇలానే సంభవించి ఉంటుందని సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ రమేశ్‌ గూడపాటి మీడియాకు తెలిపారు.