Telangana State Level Police Recruitment Board: తెలంగాణలో ఆదివారం కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఎంతో పకడ్బంధీగా ఈ పరీక్షను నిర్వహించింది. అయితే.. కానిస్టేబుల్ ప్రశ్నాపత్రంలో తప్పులు ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మొత్తం 13 ప్రశ్నల్లో గందరగోళం తలెత్తినట్టు పలువురు పేర్కొంటున్నారు. అయితే.. అభ్యర్థుల నుంచి వచ్చే అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకొని 8 మార్కుల వరకు కలిపే అవకాశం ఉందని జోరుగా ప్రచారం సాగుతోంది. కాగా.. కానిస్టేబుల్ ప్రిలిమినరీ ప్రశ్నాపత్రంలో తప్పులున్నాయంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సోమవారం స్పందించింది. కానిస్టేబుల్ క్వశ్చన్ పేపర్ లోని ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు జరుగుతోన్న వదంతులపై రిక్రూట్ మెంట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెట్ D లో 13 ప్రశ్నలు గందరగోళంగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయని ఉన్నతాధికారులు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి, రెండు రోజుల్లో దీనిపై స్పష్టమైన సమాచారం ఇస్తామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఓ ప్రకటనలో తెలిపింది.
అభ్యర్థులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దంటూ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. నిపుణుల కమిటీతో చర్చించి వారు ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా.. మార్కులు కలపాలా..? వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. దీనిపై స్పష్టమైన వివరణ వచ్చేంతవరకు ఎలాంటి వదంతులు నమ్మొద్దంటూ సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..