తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తన ప్రకటనలో పేర్కొంది. బుధవారం (ఏప్రిల్ 5) ద్రోణి జార్ఖండ్ నుంచి ఇంటీరియర్ ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిమీ ఎత్తులో కొనసాగుతుందని వాతావరణ కేంద్రం వివరించింది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఏప్రిల్ 6వ తేదీన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
కాగా గత కొద్ది రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు కోలుకోలేని దెబ్బతీశాయి. వడగండ్లు, ఈదురు గాలులు కారణంగా పండించిన పంట మొత్తం వానపాలైంది. ఆరుగాలంపాటు కష్టపడి పడించిన పంట చేతికొచ్చే సమయానికి వానలు రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న, మిర్చి, మామిడి, బొప్పాయి, అరటి తోటలకు కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో వాలిపోయిన పంటను తీసేందుకు యంత్రాలు, కూలీలకు రెట్టింపు ధరలు చెల్లించాల్సి వస్తోందని అన్నదాతలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.