Telangana Rains: రాష్ట్రంలో మళ్ళీ కుండపోత వర్షాలు.. మరో ఐదు రోజులు కురిసే అవకాశం.. పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పొంగుతున్న వాగులు, నదులు
నైరుతి ఋతుపవనాలతో పాటు, ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు (జూలై 27వ తేది) వరకూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది
Telangana Rains: వర్షాలు తగ్గినట్లే తగ్గి.. మళ్ళీ తెలంగాణలో దంచికోడుతుంది. గత 24 గంటల నుంచి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. శుక్రవారం తెల్లవారు జామునుంచి మొదలైన ఎడతెరపి లేకుండా రాత్రివరకూ కురుస్తూనే ఉంది. నైరుతి ఋతుపవనాలతో పాటు, ఒడిశా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని.. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు (జూలై 27వ తేది) వరకూ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. గ్రేటర్ హైదరాబాద్, మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మిలిగిన జిల్లాల్లో కొన్నిటికి ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో ఆయా జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలు చేపట్టారు. అవసరం అయితే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచిస్తున్నారు.
రాష్ట్రంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు మరో ఐదురోజుల పాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ పేర్కొంది. కొన్ని చోట్ల కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ సూచించారు. భారీ వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగుతున్నాయి.
హైదరాబాద్ నగర పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది. అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. భారీ వానతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమీర్ పెట్, పంజాగుట్ట, కూకట్పల్లి, నిజాంపేట, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నాళాలు పొంగిపొర్లుతున్నాయి. హుస్సేన్‌సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుందని నీటి పారుదల అధికారులు చెప్పారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి..