TS Traffic Challans: నేటి నుంచి వాహనదారులకు బంపర్ ఆఫర్.. పెండింగ్ చలనాలపై భారీ రాయితీ
TS Traffic Challans: తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ట్రాఫిక్..
TS Traffic Challans: తెలంగాణ ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. మార్చి 1 నుంచి 31వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ట్రాఫిక్ చలానాలపై అధికారులు పెద్ద మొత్తంలో ఆఫర్ ప్రకటించారు. ప్రతి రోజు ఎంతో మంది నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో ట్రాఫిక్ చలనాలు (Traffic Challans) పడిపోతున్నాయి. కొంత మందికి వేలల్లో ఉంటాయి. అలాంటి వారికి భారీ ఉపశమనం కలిగిస్తోంది తెలంగాణ (Telangana) ట్రాఫిక్ పోలీసు శాఖ. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలలో అధికంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులే ఉండే అవకాశం ఉంది. హెల్మెట్లు ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ లాంటి చలానాలే అధికం ఉంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వాహనదారులకు భారీ ఊరట కలిగించారు. వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే 75శాతం రాయితీ ఉంటుంది.
ఉదాహరణకు.. ఓ ద్విచక్ర వాహనదారునికి వివిధ ఉల్లంఘనల కింద రూ.10వేల చలనాలు ఉంటే ఆ మొత్తానికి రాయితీలో భాగంగా రూ.2500 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అలాగే సర్వీస్ చార్జి కింద వసూలు చేసే రూ. 35ను కూడా రాయితీలో భాగంగా పరిగణిస్తారు. ఫోర్ వీలర్ వాహనాలకు 50 శాతం రాయితీ ప్రకటించారు. అదే విధంగా ఉల్లంఘనుల్లో ఆర్టీసీ బస్ డ్రైవర్లు కూడా ఉన్నందున… వారికి 70శాతం రాయితీ ప్రకటించారు ట్రాఫిక్ పోలీసులు. వీళ్లు 30 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.
వితౌట్ మాస్క్ పెనాల్టీలకు 90 శాతం రాయితీ
ఇక కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది మాస్క్‌లు లేకుండా రోడ్లపై తిరిగారు. అలాంటివారిపై పోలీసులు కొరఢా ఝులిపించారు. మాస్క్‌లేకుండా రోడ్లపై తిరిగే వారికి పోలీసులు రూ.1000 జరిమానా విధించారు. వారికి కూడా భారీ రాయితీ కల్పించారు అధికారులు. వారు 90 రాయితీ పోనూ కేవలం 10శాతంతో పెనాల్టీ చెల్లించవచ్చని ప్రకటించారు. రూ.1000 జరిమానా ఉంటే కేవలం రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ఇక వాహనదారులు పెండింగ్‌లో ఉన్న చలనాలను ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అంతేగాకుండా రోడ్లపైకి తోపుడు బండ్లను తీసుకొచ్చి ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినవారికి 80 శాతం రాయితీ ప్రకటించారు. రాయితీలు ప్రకటించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా జమ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బంపర్ ఆఫర్ మార్చి 31వ తేదీ వరకు అమల్లో ఉంటుంది. జరిమానాలు పడి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారికి ఇది అద్భుతమైన అవకాశం.
రాష్ట్ర వ్యాప్తంగా 600కోట్లకుపైగా పెండింగ్ చలనాలు:
ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 600 కోట్లకుపైగా పెండింగ్ చలనాలు ఉన్నట్లు పోలీసు శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా రాయితీలతో ఎంతోకాలంగా చలానాలు చెల్లించకుండా వేచి చూస్తున్న వాహనదారులకూ ఓ అవకాశం కల్పించినట్లు అవుతుంది. ఇలా చెల్లించాలి..పెండింగ్ చలానాలున్న వాహనదారులు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అందులో వాహనం నంబరు ఎంటర్ చేయగానే పెండింగ్ ట్రాఫిక్ చలానాల వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. పెండింగ్ చలానాల సంఖ్య, మొత్తం జరిమానాతోపాటు తాజా రాయితీ తర్వాత ఎంత చెల్లించాలనే వివరాలన్నీ కనిపిస్తాయి. పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే తదితర డిజిటల్ వాలెట్‌లతో పాటు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.
ఆందోళన చెందవద్దు..
పెండింగ్ చలనాలకు భారీ రాయితీ కల్పించడంతో పెద్ద మొత్తంలో వాహనదారులు చెల్లించే అవకాశం ఉంది. ఒకేసారిగా ఆన్‌లైన్ ద్వారా చెల్లింపులు జరపనుండటంతో సర్వర్లు మొరాయించే అవకాశం ఉంది. అలాంటి సమయంలో వాహనదారులు ఆందోళనకు గురి కావద్దని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈనెల 31 వరకు అవకాశం కల్పించామని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి: