Telangana: దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠను రేపుతున్న విపక్షాల సమావేశానికి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ నిర్ణయించుకుందా? ముఖ్య నేతలు కానీ, ప్రతినిధులు కానీ ఎవరూ వెళ్లకూడదని డిసైడ్ అయ్యారా? దీనంతటికీ కారణం కాంగ్రెస్‌కు ఆహ్వానం పంపడమేనా? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. అవును, విపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే లక్ష్యంతో ఇవాళ ఢిల్లీలో తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో విపక్ష పార్టీల సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాల్సి ఫిక్స్ అయిందట.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈ నిర్ణయం వెనుక ప్రధానంగా నాలుగు కారణాలున్నాయని తెలుస్తోంది. బీజేపీకి ఎంత దూరంగా ఉంటుందో.. కాంగ్రెస్ పార్టీకి కూడా అంతే దూరంలో ఉండాలని టీఆర్ఎస్ ఫిక్స్ అయ్యింది. అదే విషయాన్ని అనేక సందర్భాల్లో, అనేక వేదికలపై చెబుతూనే వస్తోంది టీఆర్ఎస్. ఇందులో భాగంగానే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రత్యామ్నాయ రాజకీయాలపై ఫోకస్ పెడుతూ వస్తున్న గులాబీ బాస్. దేశ వ్యాప్తంగా ప్రముఖ నాయకులందరినీ కలుస్తూ ఇదే అంశంపై చర్చిస్తున్నారు. మమతా బెనర్జీని అనేక పర్యాయాలు కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇదే విషయాన్ని వివరించారు. అయినప్పటికీ ఈ సమావేశానికి కాంగ్రెస్‌ను ఆహ్వానించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ విషయంలో తమకున్న అభ్యంతరాలు చెప్పినప్పటికి కూడా ఆ పార్టీని ఆహ్వానించడం సరికాదని టీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రధాన పోటీదారైన కాంగ్రెస్‌తో ఏ స్థాయిలోనూ వేదిక పంచుకొనే అవకాశం ఉండనే ఉండదని టీఆర్ఎస్ వర్గాలు కుండబద్దలు కొట్టాయి. ఇకపోతే విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహణ పద్ధతే సరిగా లేదని టీఆర్ఎస్ ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారట.