MLA Ramulu Naik : ‘అవసరమైతే డబ్బులివ్వండి. ఇదంతా ఆఫ్‌ ది రికార్డ్‌, డోన్ట్‌ వర్రీ, నే చూసుకుంటా. కానీ.. మనమే గెలవాలి’

|

Mar 13, 2021 | 6:59 PM

MLA Ramulu Naik : అతనో ప్రజాప్రతినిధి. ఓ నియోజకవర్గానికి ప్రజలు ఎన్నుకున్న MLA. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన లీడర్‌. అయితేనేం...అవన్నీ మరిచిపోయాడు. గెలుపే లక్ష్యంగా..

MLA Ramulu Naik : అవసరమైతే డబ్బులివ్వండి. ఇదంతా ఆఫ్‌ ది రికార్డ్‌, డోన్ట్‌ వర్రీ, నే చూసుకుంటా. కానీ.. మనమే గెలవాలి
Ramulu Naik
Follow us on

MLA Ramulu Naik : అతనో ప్రజాప్రతినిధి. ఓ నియోజకవర్గానికి ప్రజలు ఎన్నుకున్న MLA. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన లీడర్‌. అయితేనేం…అవన్నీ మరిచిపోయాడు. గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లాలని కేడర్‌కి పిలుపునిచ్చాడు. అవసర మైతే డబ్బులు ఇచ్చి…ఓటు వేయించాలని కోరాడు. ఇదంతా ఆఫ్‌ ది రికార్డ్‌…డోన్ట్‌ వర్రీ…నేను చూసుకుంటా. కానీ..మనమే గెలవాలి. ఇది తెలంగాణ MLC ఎన్నికల సందర్భంగా అధికారపార్టీకి చెందిన ఓ MLA హాట్‌ కామెంట్‌. ఇలా ఉంది తెలంగాణ MLC ఎన్నికల్లో ప్రలోభాల పర్వం.

ఇవేం జనరల్‌ ఎలక్షన్స్‌ కాదు…పంచాయతీ, మునిసిపాలిటీ ఎన్నికలు అస్సలే కాదు. విద్యావంతులు తమ ప్రజాప్రతినిధులను ఎన్నుకునే గ్రాడ్యుయేట్‌ MLC ఎన్నికలు. అయితేనేం…ఎన్నికలు ఏవైనా మా పంథా ఒక్కటే అన్న రీతిలో వ్యవహరిస్తున్నారు కొందరు ప్రజాప్రతినిధులు. ప్రలోభాలతో ఓట్లు కొనడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారు. తెలంగాణలో MLC ఎన్నికల సందర్భంగా ఓ ప్రజాప్రతినిధి బహిరంగ సమావేశంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల కోసం ఖమ్మంజిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌ స్థానిక TRS నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు నాయక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేద్దామని TRS శ్రేణులకు సూచించారు. వైరా నియోజకవర్గంలో ఉన్న గ్రాడ్యుయేట్‌ ఓటర్ల లిస్టు దగ్గరపెట్టుకోండి. మొదట కింద నుంచి పైకి…పైనుంచి కిందకి స్టడీ చేయాలన్నారు. ఓటర్లను ఏ,బీ,సీ,డీలుగా విభజించి…అందులో టీఆర్ఎస్‌కు ఓటు వేసేవారు, వేయనివారిని గుర్తించాలన్నారు. TRS పార్టీకి ఓటు వేసే ఉద్దేశం లేని ఓటర్లకు డబ్బులు పంపిణీ చేద్దామని సూచించారు.

డబ్బులు కూడా ఇస్తామని ఎమ్మెల్యే రాములు నాయక్‌ చెప్పడంతో వేదికమీదున్న నేతలు కూడా ఖంగుతిన్నారు. అలా చెప్పొద్దని ఆపే ప్రయత్నం చేశారు. అయినా….ఎమ్మెల్యే రాములు నాయక్‌ వినలేదు. తన స్పీచ్‌ కంటిన్యూ చేశారు. చెప్పకూడదు..కానీ…ఇదంతా ఆఫ్ ది రికార్డ్…డబ్బులు కూడా ఇస్తాం… యస్.. భయమేమీ లేదు… ఖర్చులకు కూడా ఇస్తాం…అంటూ రాములు నాయక్ హాట్‌ కామెంట్‌ చేశారు.

MLA రాములు నాయక్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే బహిరంగంగా ఓటర్లకు డబ్బులు కూడా ఇస్తామని చెప్పడంపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. రాములు నాయక్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేశారు. ప్రలోభాలతో అధికారపార్టీ గెలవాలని చూస్తోందని విమర్శించారు. మరోవైపు రాములు నాయక్‌ వ్యాఖ్యలపై పట్టభద్రులైన ఓటర్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్‌గా ఓట్లకు డబ్బులు పంచుతామని ఎంత ధైర్యంగా చెబుతున్నారు అంటూ నిలదీస్తున్నారు.

అధికార టీఆర్ఎస్ తమ సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని నిలుపుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని భావిస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో మరిపించాలనుకుంటోంది. అందుకే పలువురు మంత్రులకు సైతం బాధ్యతలు అప్పగించి ప్రచారం పర్వంలోకి దింపింది. గెలుపు బాధ్యతలు వారిపైనే పెట్టింది. అంతేకాదు,ఒకవేళ ఎవరైనా అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని గులాబి దళపతి కేసీఆర్‌ నుంచి హెచ్చరికలు కూడా వెళ్లినట్టు సమాచారం. దీంతో గ్రౌండ్‌ లెవెల్లో TRS పార్టీ నేతలు చాలా సీరియస్‌గా పనిచేస్తున్నారు.

Read also : Jr ntr political entry : ఇంతకీ రాజకీయాల్లోకి వస్తారా? రా రా? ఎవరు కోటీశ్వరులు ప్రొమో లాంచింగ్ వేళ ఎన్టీఆర్ మాటలతో కొత్త డౌట్లు.!