Teegala Krishna Reddy on sabitha indra reddy: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణా రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడం లేదని.. కబ్జాలను మాత్రమే ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. మీర్‌పేట్‌ను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మీర్‌పేటను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోనని ఆయన హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని తీగల పేర్కొన్నారు. నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డి కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని తీగల కృష్ణారెడ్డి ఆరోపించారు. తమ పార్టీ నుంచి మంత్రి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదని.. నియోజకవర్గంలో అభివృద్ధిని గాలికొదిలేశారంటూ తీగల విమర్శించారు.
మీర్‌పేట్‌లో పర్యటించిన తీగల కృష్ణారెడ్డి జరుగుతున్న పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంక్ లైన్‌లు పూర్తి కాలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంత్రి సబిత వైఖరిపై సీఎంతో మాట్లాడతానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. ఇలాగే కంటిన్యూ అవసరమైతే ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు. కాగా.. గత ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున సబితా ఇంద్రారెడ్డి.. టీఆర్ఎస్ నుంచి తీగల కృష్ణారెడ్డి పోటీ చేయగా.. సబిత విజయం సాధించారు. అనంతరం సబితా ఇంద్రా రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుని మంత్రి పదవి పొందారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాజాగా.. తీగల కామెంట్లు మహేశ్వరం టీఆర్‌ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..