CM KCR: బీఆర్‌ఎస్‌ తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు.. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాల్లో పోటీ

Ram Naramaneni

Ram Naramaneni |

Updated on: Dec 09, 2022 | 2:52 PM

గులాబీ జెండా మధ్యలో భారతదేశం ఉండేలా కొత్త జెండాను రూపొందించారు. ఐతే పార్టీ పేరు మారినా కారు గుర్తు కొనసాగనుంది. ఇక బీఆర్‌ఎస్‌ ఆవిర్భావంతో తెలంగాణ భవన్ ఎదుట కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

CM KCR:  బీఆర్‌ఎస్‌ తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు.. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాల్లో పోటీ
BRS Party CM KCR

తెలంగాణ రాష్ట్ర సమితి BRSగా మారిపోయింది. పార్టీ చరిత్రలో నవశకం మొదలైంది. 21 ఏళ్ల ఉద్యమపార్టీ ప్రస్థానంలో ఇది సరికొత్త చరిత్ర. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి 13 ఏళ్ల తర్వాత ఆ గమ్యాన్ని ముద్దాడింది. వరుసగా రెండు సార్లు అధికారం చేపట్టిన TRS.. 8 ఏళ్ల తర్వాత భారత్‌ రాష్ట్ర సమితిగా మారిపోయింది. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సమాయత్తమైంది.. ముందుగానే నిర్ణయించిన దివ్యముహూర్తం ప్రకారం..సరిగ్గా 1:20 నిమిషాలకు ఈసీ పంపిన BRS పత్రాలపై సంతకం చేశారు CM కేసీఆర్..! అనంతరం BRS జెండాను ఆవిష్కరించారు..!

శంషాబాద్‌ మెట్రోకు శంకుస్థాన చేసిన తర్వాత.. అక్కడి నుంచి నేరుగా తెలంగాణభవన్‌కు చేరుకున్నారు CM కేసీఆర్.. పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు…! తెలంగాణ అస్థిత్వానికి ప్రతీకగా..! రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా మారింది. ఈ ప్రక్రియకు సంబంధించిన ఫార్మాలిటీస్‌ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయనుంది ఈసీ.. అక్టోబర్‌ 5న TRSను BRSగా గుర్తించాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు కేసీఆర్. ఈసీ సూచన మేరకు పార్టీ పేరుపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో చెప్పాలంటూ పబ్లిక్‌ నోటీస్‌ కూడా ఇచ్చారు. గడువు ముగిసినా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్‌ రాష్ట్ర సమితిగా గుర్తిస్తున్నట్లు అధికారికంగా లేఖ రాసింది ఎన్నికల సంఘం..! ఇప్పుడు ఈ లేఖపైనే సంతకం చేసి మళ్లీ ఈసీకి పంపారు కేసీఆర్.

BRS నూతన జెండాను ఆవిష్కరించారు కేసీఆర్. గులాబీ జెండా మధ్యలో భారతదేశం మ్యాప్‌ ఉంది. పార్టీ పేరు, జెండా మారినప్పటికీ కారు గుర్తుమాత్రం కొనసాగనుంది. ఈ ఏడాది అక్టోబ‌ర్ 5న‌.. ద‌స‌రా రోజున జాతీయ పార్టీపై ప్రకటన చేశారు కేసీఆర్. TRSను BRSగా మారుస్తూ.. పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. కేసీఆర్‌తో పాటు 283 మంది ప్రతినిధులు ఆ తీర్మానంపై సంత‌కం చేశారు. 21ఏళ్ల ప్రస్థానంలో ఇదో కీలక మలుపు. ఇప్పుడు EC గుర్తింపుతో TRS.. BRSగా మారిపోయింది.

కర్నాటక ఎన్నికల్లో పోటీ..

జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు..! BJPని నేరుగా ఢీ కొట్టేందుకు సై అంటున్నారు..! దేశం మారాలి. అది తెలంగాణ నుంచే మొదలవ్వాలని దాదాపు ప్రతి మీటింగ్‌లోనూ చెబుతున్నారు..! ఇప్పటికే పలు పార్టీల జాతీయ నేతలతోనూ ఆయన సమావేశం అయ్యారు. 2023లో రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇకపై కేసీఆర్ అడుగులు ఉంటాయని చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. బీఆర్‌ఎస్‌ తొలి టార్గెట్‌ కర్నాటక ఎన్నికలు. 2023 మేలోపు ఈ ఎన్నికలు జరుగుతాయి. BRS తొలి ప్రస్థానం కన్నడ గడ్డపై నుంచే మొదలవుతుంది. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో JDS తో కలిసి పోటీ చేయనుంది BRS. గుల్బర్గా నుంచి బీదర్‌ వరకు ఏడు జిల్లాల్లో పోటీ చేయనుంది BRS.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu