Vikarabad: శంకరెడ్డిపల్లి తండాలో విపత్కర పరిస్థితి.. తాగునీరు లేక అల్లాడిపోతున్న జనం..
తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తున్న గిరిజనులు… మిషన్ భగీరథ ఉన్నా నీరు రాక తండాల్లో తీవ్ర ఎద్దడి. వికారాబాద్ జిల్లా శంకరెడ్డిపల్లి తండాలో బోరు ఎండిపోవడంతో ప్రజలు నానాకష్టాలు పడుతున్నారు. పూర్తి వివరాలు కథనం లోపల తెలుసుకుందాం పదండి ...

పట్టణాల్లో అభివృద్ధి పెరిగిపోతున్నా.. గిరిజన తండాల్లో మాత్రం ఇప్పటికీ మౌలిక సమస్యలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. అందులో ముఖ్యంగా తాగునీటి కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం శంకరెడ్డిపల్లి తండాలో పరిస్థితి చూస్తే ఆ బాధ మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం మిషన్ భగీరథ ఉన్నప్పటికీ.. ఇక్కడ నీరు మాత్రం అందడం లేదు. వేసవి కాలం వచ్చేసరికి పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. తండాలో ఉన్న ఒక్కగానొక్క బోరుబావి కూడా ఎండిపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రతి ఉదయం గ్రామానికి దూరంగా ఉన్న వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం ఇక్కడి ప్రజలకు నిత్యకృత్యంగా మారిపోయింది. కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు మోసుకొచ్చే పరిస్థితి మహిళలు, వృద్ధులు, చిన్నారులపై ఎక్కువ భారాన్ని మోపుతోంది. తాగునీటి కోసం పడుతున్న ఈ కష్టాలు వారి రోజువారీ జీవనాన్ని కష్టతరం చేస్తున్నాయి. ఇంకా ఆందోళనకర విషయం ఏమిటంటే… కేవలం వేసవిలోనే కాదు, కొన్నిచోట్ల వానాకాలంలో కూడా ట్యాంకర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొనడం. ఇది తండాల్లో నీటి సమస్య ఎంత తీవ్రమైందో చెబుతోంది. తండాలు గ్రామ పంచాయతీలుగా మారినా.. మౌలిక సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదని స్థానికులు వాపోతున్నారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు తరచూ హామీలు ఇస్తున్నా… సమస్యకు శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి కోసం రోజూ పడుతున్న కష్టాలు తగ్గాలంటే వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన తండాల్లో తాగునీటి సమస్యను తాత్కాలిక పరిష్కారాలతో కాకుండా.. దీర్ఘకాలిక ప్రణాళికలతో పరిష్కరించడం అవసరం. లేకపోతే అభివృద్ధి కథలు కేవలం మాటలకే పరిమితమవుతాయి.. నేలమీద పరిస్థితులు మాత్రం మారవు.
