Telangana: హాట్ టాపిక్ గా మారుతున్న పరిణామాలు.. వారిపై ఫిర్యాదు చేయనున్న టీపీసీసీ
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు టీపీసీసీ సిద్ధమైంది....
తెలంగాణ కాంగ్రెస్ లో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీకి మారిన12 మంది ఎమ్మెల్యేలపై మొయినాబాద్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు టీపీసీసీ సిద్ధమైంది. ఈ రోజు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకులు భేటీ కానున్నారు. సీఎల్పీ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు కాంగ్రెస్ ముఖ్య నాయకుల బృందం వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరినందుకు వారికి వచ్చిన రాజకీయ, ఆర్థిక లాభాల గురించి సవివరంగా ఫిర్యాదు చేయనున్నారు. నలుగురు ఎమ్మెల్యేల కేసు సిట్, సీబీఐ, హైకోర్టులలో వాదనలు జరుగుతున్న క్రమంలో కాంగ్రెస్ ఈ విషయంలో ఫిర్యాదు చేస్తుండడంతో చర్చనీయాంశంగా మారింది.
కాగా..తెలంగాణ కాంగ్రెస్ లో నెలకొన్న అనిశ్చితిని చక్కదిద్దేందుకు సీనియర్ లీడర్ దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగారు. గాంధీ భవన్‌లో పలువురు నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. కాగా.. టీడీపీ పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని సీనియర్ నేతలు ఆరోపిస్తున్న తరుణంలో కొద్ది రోజుల క్రితం 13 మంది నాయకులు తమ పదవులకు రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా ఉన్నారు. అయితే, తమకు పదవులు ముఖ్యం కాదని.. పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే పనిచేస్తామని సీతక్క స్పష్టం చేశారు.
టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన 13 మంది నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. వీరంతా తమ రాజీనామా లేఖలను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్ కు పంపారు. అయితే కాంగ్రెస్ పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఈ నాయకులంతా గాంధీ భవన్ లో సమావేశమవడం గమనార్హం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..