టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. ఈటల చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి కూడా అంతే స్థాయిలో వాటిని తిప్పికొట్టారు. మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే తనకు ఎవరూ డబ్బు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన ప్రతీ రూపాయి.. కాంగ్రెస్ కార్యకర్తలు చందాలు వేసుకున్నవేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలోని బలహీన వర్గాల నాయకులే ఈ ఎన్నికలకు ఆర్థిక సాయం చేశారని పేర్కొన్నారు. అలాంటి వారి శ్రమను, ఆర్థిక సాయాన్ని అవమానించేలా ఈటల మాట్లాడటం సమంజసం కాదని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈటల చేసిన వ్యాఖ్యలు అబద్ధమని తేల్చేందుకు శనివారం భాగ్యలక్ష్మి ఆలయం వద్ద తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధమా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దేవుడిపై ప్రమాణం చేసేందుకు తాను సిద్దమేనని.. తనపై చేసిన ఆరోపణలను నిరూపించేందుకు ఈటల సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు అక్కడికి రావాలని ఈటలను కోరారు. శనివారం సాయంత్రం రేవంత్ తన ఇంటి నుంచి భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లనున్నారు. అయితే రేవంత్ రెడ్డి చేసిన సవాలుపై స్పందించకూడదని ఈటల రాజేంధర్ నిర్ణయించుకున్నారు. నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల్లోనే సమాధానం ఉందంటూ చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం