అడవుల జిల్లా కొమురం భీం ఆసిపాబాద్ జిల్లా కు బెబ్బులి భయం పట్టుకుంది. సరిహద్దు మహారాష్ట్రాలో పులుల సంఖ్య గణనీయంగా పెరగడం. ఆవాసం కోసం బెబ్బులి సరిహద్దు దాటి జిల్లాలోని అడవుల్లోకి వస్తుండటంతో కాగజ్ నగర్ కారిడార్ లో పులుల సంచారం పెరిగింది. వలసల పులుల రాకతో అటవీశాఖ హర్షం వ్యక్తం చేస్తుంటే, స్థానిక జనం మాత్రం భయభ్రాంతులకు గురవక తప్పని పరిస్థితి. ఇప్పటికే జిల్లాలో పులి దాడులు పెరగడం.. మనుషులపై అటాక్ చేసి ప్రాణాలు తీయడంతో భయాందోళన మధ్యే జీవనం సాగించాల్సిన పరిస్థితి జిల్లా వాసులది. తాజాగా బెబ్బులి జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలోనే సంచరించడంతో ఎటు వైపు నుండి పులి దాడి చేస్తుందో అన్న భయం జిల్లా కేంద్రంలో కనిపిస్తోంది. మరో వైపు వలస వచ్చిన పులిని వచ్చినట్టే వేటగాళ్లు హతం చేస్తుండటం కూడా అటవీశాఖ ను ఆందోళనకు గురి చేస్తోంది.
కొమురం భీం ఆసిపాబాద్ జిల్లా కేంద్రానికి 5 కిమీ దూరంలో పులి సంచరిస్తుండటం జిల్లా వాసులను భయాందోళనకు గురి చేస్తోంది. జిల్లా కేంద్రానికి సమీపంలోని గోవింద్ పూర్, గుండి, కెస్లాపూర్ గ్రామాలలోని పంట చేన్లలో పెద్దపులి సంచరించడంతో.. రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు పంటపొలాలలో పని చేస్తుండగా గాండ్రిపులు వినిపించడం.. భయాందోళనకు గురైన రైతులు పంటపొలాలను పరిశీలించగా.. సమీప పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఆర్వో గోవింద్ చంద్ సర్దార్, డీఆర్వో యోగేష్, ఎఫ్ఎస్‌వో విజయ్, ఎఫ్‌బీవోలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి పాద ముద్రలను గుర్తించి పెద్దపులివిగా నిర్ధారించారు. 13 నుండి 14 మీటర్ల పొడవున్న పులి పాదముద్రలుగా గుర్తించి 3 ఏళ్ల వయసున్న పులిగా అంచనా వేశారు. గోవింద్ పూర్ శివారు ప్రాంతం మీదుగా ఆసిపాబాద్ జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ హనుమాన్ ఆలయం వెనుక నుంచి పెద్ద వాగు దాటి కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్ వైపు వెళ్లి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.
తిప్పేశ్వర్ అభయారణ్యం నుండి వలస వచ్చిన పులిగా భావిస్తున్న అధికారులు.. అంకుసాపూర్ పరిసర ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా నిర్దారించారు. ప్రస్తుతం పంటల సమయం కావడంతో పులి సంచారంతో రైతులు మరింత భయాందోళనకు గురవుతున్నారు. బూరుగూడ, ఈదులవాడ, రాజూర, గుండి, గోవింద్పూర్ గ్రామాల ప్రజలు, రైతులు ఒంటరిగా వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు. గతంలో కాగజ్ నగర్ మండలంలో అటవీ ప్రాంతంలో రెండు పులులను విష పెట్టి చంపిన ఘటన నేపథ్యంలో వలస వచ్చిన పులికి ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రం ఆసిఫాబాద్ వైపుగా పులి వెళ్లే అవకాశం ఉండటంతో ఆ ప్రాంతం ప్రజలను సైతం అలర్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..