Tiger Tension: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల కలకలం.. పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చి నలు దిక్కులు నావేనంటూ సంచారం..

|

Sep 20, 2022 | 3:55 PM

ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోను పులి‌సంచారం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటి రిజర్వాయర్ సమీపంలో పులి సంచరిస్తున్నట్టుగా అటవి శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు.

Tiger Tension: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల కలకలం.. పక్క రాష్ట్రం నుంచి వలస వచ్చి నలు దిక్కులు నావేనంటూ సంచారం..
Tiger Tension In Adilabad
Follow us on

Tiger Tension in Adilabad: ఉమ్మడి ఆదిలాబాద్ లో పులుల సంచారం కలకలం రేపుతోంది. వలస వచ్చిన పులులు నలు దిక్కులు నావే అన్నట్టుగా.. ఒకేరోజు మూడు జిల్లాలోని మూడు వేరు వేరు ప్రాంతాల్లో కనిపించాయి. స్థానికుల‌ సమాచారంతో అటవిశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పులుల పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు. పులుల సంచారం ఉన్న సమీప ప్రాంతాల ప్రజలను ముందస్తుగా అధికారులు అప్రమత్తం చేశారు. పశువుల‌ కాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. మహరాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో పులుల సంచారం కనిపించడంతో వలస వచ్చిన పులులుగా అటవి శాఖ అధికారులు భావిస్తున్నారు.

ఒకే రోజు ఒకే సమయంలో మూడు ప్రాంతాల్లో పులులు సంచరిస్తుండడంతో ప్రజల్లో భయం మొదలైంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వలస వచ్చిన పులి జిల్లాలోని అటవి ప్రాంతాలలో సంచరిస్తూ స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. కొమురంభీం జిల్లా పెంచికల్ పేట మండలం జిల్లెడ్ గ్రామ సమీపంలో, మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సంకారం , చింతలపల్లి గ్రామాల మద్య.. ఆదిలాబాద్ పిప్పల్ కోటి రిజర్వాయర్ సమీపంలో పులి కనిపించిందంటూ అటవిశాఖ అదికారులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో అలర్ట్ అయిన అటవిశాఖ సిబ్బంది పులి పాదముద్రలు సేకరించే పనిలో పడ్డారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని చింతలపల్లి మీదుగా బుద్దారం అటవీ ప్రాంతంలో పులి వచ్చినట్లు పాదముద్రల ఆదారంగా గుర్తించిన అటవి అధికారులు.. బుద్దారం, కిష్టంపేట , సంకారం గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. అటవీ ప్రాంతంలోకి పశువులను మేతకు తీసుకు వెళ్ల వద్దని.. రైతులు, వాగుల వద్దకు చేపల వేటకు వెళ్లే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు గ్రామాల్లో సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రాణహిత దాటి మహరాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని అటవి ప్రాంతం నుండి ఈ పులి వలస వచ్చినట్టుగా గుర్తించారు అటవిశాఖ అధికారులు. ఇటు కొమురంభీం జిల్లాలోని పెంచికల్ పేట మండలం జిల్లేడ గ్రామ సమీపంలోని పత్తి చేన్లలలో పులి పాద ముద్రలను‌ గుర్తించారు అటవి అధికారులు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన పులిగా గుర్తించిన అధికారులు.. చెన్నూర్ రేంజ్ అటవి సమీపంలో పులి సంచరిస్తున్న సమీప అటవిప్రాంతంలోని ఆరు గ్రామాల ప్రజలను‌ అప్రమత్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అటు ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోను పులి‌సంచారం కలకలం రేపుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం పిప్పల్ కోటి రిజర్వాయర్ సమీపంలో పులి సంచరిస్తున్నట్టుగా అటవి శాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు చేస్తున్న జేసీబీ డ్రైవర్ కు పులి కనిపించినట్టుగా ప్రచారం జరగడం.. పులిని సెల్ ఫోన్ వీడియోలో బందించిన వీడియో ఆదిలాబాద్ సోషల్ మీడియా గ్రూప్ ల్లో వైరల్ అవడంతో అప్రమత్తమైన అటవి అధికారులు.. ఆ వీడియో ఓల్డ్ వీడియో గా గుర్తించారు. పిప్పల్ కోటి రిజర్వాయర్ సమీపంలో ఎలాంటి పాదముద్రలు లభించలేదని.. వర్షం కారణంగా పాదముద్రలు స్పష్టంగా కనిపించలేదని అటవి అధికారులు తెలుపారు. అయినా ఈ ప్రాంతం మహారాష్ట్ర తడోబా టైగర్ రిజర్వ్ ఏరియాలు దగ్గరగా ఉండటం సమీప పెనుగంగా తీర ప్రాంతంలో పులుల సంచారం కొనసాగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అటవి అధికారులు. ఒకే రోజు ఉమ్మడి జిల్లాలో మూడు మూడు వేరు వేరు చోట్ల పులుల సంచారం కలకలం రేగగా.. మంచిర్యాల, కొమురంభీం జిల్లాలో మహారాష్ట్ర నుండి వలస వచ్చిన రెండు పులులుగా గుర్తించిన అధికారులు.. ఆదిలాబాద్ పిప్పల్ కోటిలో పులి సంచారంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Reporter: Naresh, TV9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..