
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోనే ఏకంగా చిరుత పులి సంచారంతో.. ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాదు.. రుద్రంగి, చందుర్తి వంటి మండలాల ప్రజానీకమూ భిక్కుభిక్కుమంటూ భయాందోళనలకు గురవుతున్నారు. రుద్రంగిలోని బుగ్గ రాజరాజేశ్వరాలయం పరిసరాల్లో చిరుత ప్రత్యక్షమై ఇప్పుడు ఊళ్లో గుబులు రేపుతోంది. రాత్రి ఓ బండపై ఉన్న చిరుతను చూసి అటువైపుగా వెళ్తున్న యువత షాక్‌కు గురైంది. అయితే కాస్త దూరం నుంచి వారి వద్దనున్న మొబైల్‌లో చిరుతను వీడియోలో చిత్రీకరించింది. ఈ విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, గ్రామప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే గ్రామపంచాయితీ ప్రకటించింది. మరోవైపు ఇప్పటికే రుద్రంగి, మర్రిమడ్ల, మానాల వంటి అటవీ ప్రాంతాల్లో చిరుతల సంచారమున్నట్టు అటవీశాఖ అధికారులు ధృవీకరించారు. అటు నిజామాబాద్, కామారెడ్డి వంటి ప్రాంతాల దట్టమైన అడవులతో మానాల వంటి అటవీప్రాంతానికి కనెక్టివిటీ ఉండటంతో.. ఎల్లారెడ్డిపేట ప్రాంతం నుంచి చిరుత రుద్రంగి వైపు వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మొత్తంగా రుద్రంగి మండల కేంద్రంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజానీకమంతా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖతో పాటు, గ్రామపంచాయితీ సిబ్బంది హెచ్చరిస్తున్నారు.