
ఓ వైపు సమాజంలో సాంకేతింక రంగం పరుగులు పెడుతున్న తరుణంలో మరోవైపు ప్రజలు ఇంకా మూఢనమ్మకాల్లోనే మునిగిపోతున్నారు. వారి నమ్మకాలను ఆసరగా చేసకుని కొంతమంది దొంగ బాబాలు ఎంతో మందిని మోసం చేస్తున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్ నర్సింగి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ముగ్గురు కేటుగాళ్లు..తాము మేడారం నుంచి వచ్చామని, తమ వద్ద అతీత శక్తులు ఉన్నాయని నార్సింగి లో ఉంటున్న ప్రజలను నమ్మించారు. అక్కడున్న అమయకులను లక్ష్యంగా చేసుకొని జ్యోతిష్యం, బ్లాక్ మ్యాజిక్ పేరుతో అమాయకులను మోసం చేయడం మొదలుపెట్టారు. మీరు సమస్యల్లో ఉన్నారని.. కొన్ని పూజలు చేస్తే సకల ఐశ్వర్యాలు వస్తాయంటూ నమ్మించి డబ్బులు దండుకున్నారు.
దీనిపై కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఆ ముఠా సభ్యుల్ని పట్టుకున్నారు. నిందితులు సారయ్య, శివ కుమార్, సాగర్ లుగా గుర్తించారు. వాళ్ల నుంచి రూ.84 వేల నగదు, ఒక కారు, 4 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. చివరికి నార్సింగి పోలీసులకు ఆ నిందితులను అప్పగించారు. ఏది ఏమైనా ఇలాంటి మోసగాళ్ల మాటలు వినొద్దని ఎంతోమంది చెబుతున్నప్పటికీ కొంతమంది మాత్రం అలాంటి కేటుగాళ్లని అనుసరిస్తున్నారు. మోసపోయేవాడు ఉన్నంతకాలం మోసం చేసేవాడు ఉంటాడనడానికి ఇదో ఉదాహరణ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..