
మూగజీవుల పట్ల మమకారాన్ని పంచుతూ మానవత్వానికి నిజమైన నిర్వచనంగా నిలిచింది ఈ కుటుంబం.. వీధి కుక్కలను చేరదీసి ఇళ్లంతా సందడిగా మార్చడమే కాదు.. వాటికి కడుపునిండా ఆహారం పెట్టడం.. వాటి ఆరోగ్య పరిరక్షణ. ఈ కుటుంబానికి ఒక ఆధ్యాత్మిక ఆనందమైపోయింది. శునకాల సేవలో ఈ కుటుంబం మానవత్వానికి కొత్త నిర్వచనంగా నిలుస్తున్నారు. ఇంతకీ ఎవరు వీరు.! ఎందుకు శునకాలపై ఇంత ప్రేమ – వాత్సల్యం చూపుతున్నారు.? వాటిని ఏకంగా బెడ్ రూమ్, కిచెన్‌తో సహా ఇళ్లంతా ఇంత స్వేచ్ఛగా తిప్పుతున్నారు.! వాటి పట్ల తోబుట్టువు, కన్న బిడ్డలకు పంచే ప్రేమను పంచుతున్నారు.! అనేదే కదా మీ సందేహం.!
వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈదులపూసపల్లి గ్రామానికి చెందిన ఈ దంపతుల పేర్లు పింగిళి శ్రీనివాసరావు. ఆయన సతీమణి ప్రసన్నలక్ష్మి, వాళ్ల కూతురు దీపిక. శ్రీనివాస్ రావు డ్రాయింగ్ మాస్టర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. ఇంటి సభ్యులు ముగ్గురే. కానీ ఈ ఇంట్లో శునకాలే 36కు పైగా ఉన్నాయి. వీధి కుక్కలు అంటే ఈ కుటుంబానికి ఎక్కడ లేని ప్రేమ ఆప్యాయత.. ముఖ్యంగా అనారోగ్యంతో దీనంగా ఎదురు చూస్తున్న వీధికుక్కలను చూస్తే వీళ్ళ మనసు చెలించిపోతుంది. వాటిని చేరదీసి సపర్యలు చేసి, ఆరోగ్యం మెరుగైన శునకాలను వారి సొంత పిల్లలుగా భావిస్తూ పోషిస్తున్నారు.. ఇలా చేరదీసిన శునకాల సంఖ్య ప్రస్తుతం 36కు చేరుకున్నాయి.
ఈ శునకాల పోషణకు ప్రతి రోజూ 10 లీటర్ల పాలు, 10 కిలోల బియ్యం, కూరగాయలు, పెంపక సామాగ్రి సిద్ధం చేస్తారు.. ఇది మాత్రమే కాదు.. వీధుల్లో తిరిగే ఇతర శునకాలకు కూడా ప్రేమతో ఆహారం అందిస్తున్నారు. వాటి ఆహారం, వైద్య చికిత్సలకు నెలకు లక్షన్నర రూపాయలు ఖర్చవుతున్నా ఏ మాత్రం వెనకడుగు వేయరు.. చేరదీసిన శునకాల రోజుని బట్టి వాటి బర్త్ డేగా గుర్తించి ప్రతి సంవత్సరo కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు నిర్వహిస్తారు. 14 సంవత్సరాల క్రితం పట్టణం లోని ఇల్లందు రోడ్డుపై గాయాలతో విలవిలలాడుతున్న ఓ వీధి కుక్కను చూసిన వీళ్ళ కూతురు దీపిక చేరదీసింది. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక దానికి చికిత్స చేయించింది.. దాని ప్రాణం కాపాడింది.. అప్పటి నుంచి, అనారోగ్యంతో లేదా గాయాలతో బాధపడే శునకాలను చూస్తే ఈ కుటుంబం తట్టుకోలేరు.. వాటిని చేరదీసి వాటిపట్ల ప్రేమ ఆప్యాయతను పంచుతూ ప్రేమతో సంరక్షిస్తూ వస్తున్నారు. ప్రతి రోజు శునకాలకు అయ్యే ఖర్చు వాళ్లకు వస్తున్న పెన్షన్ డబ్బుల తోటే పోసిస్తున్నారు.. శునకాల పట్ల ఈ కుటుంబం చూపే మమకారాన్ని చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.. ఆ ఇళ్లంతా శునకాలే ఉండడంతో ఆ ఇంటికి వెళ్లాలంటే కోడా ఇతరులకు వణుకు పుడుతోంది.