ఖమ్మం జిల్లా వృద్ధ దంపతుల హత్య కేసు మిస్టరీ వీడింది.. నేలకొండపల్లి మండంలో జరిగిన హత్య కేసులో ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ 27వ తేదీన ఇంట్లో హత్యకు వృద్ధ దంపతులు వెంకటరమణ, కృష్ణ కుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో అద్దెకు దిగిన ఇద్దరు మహిళలతోపాటు ఎనిమిది మంది దోపిడీ దొంగల ముఠా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. దంపతుల హత్య అనంతరం బంగారం దోచుకుని పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
నవంబర్ 27వ తేదీన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఇంట్లో వృద్ధ దంపతులు వెంకట రమణ, కృష్ణ కుమారి దారుణ హత్యకు గురయ్యారు. ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఇంటి చుట్టూ కారం చల్లారు. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి, 15 రోజుల పాటు కష్టపడి కేసును ఛేదించారు. బంగారం, నగలు కోసమే పక్కా ప్రణాళిక ప్రకారం వీరిని హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఇందుకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కృష్ణా జిల్లా కంచికర్లకు చెందిన షేక్ అబీద్ ఓ హత్య కేసులో జీవిత ఖైదీగా ఉన్నాడు. పెరోల్ మీద బయటకు వచ్చి, మళ్ళీ వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. పేర్లు మార్చుతూ ఖమ్మం కోదాడ, సూర్యాపేట జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. వేరు వేరు ప్రాంతాల్లో పరిచయమైన వారితో ముఠాగా ఏర్పడి, డబ్బులు కోసం దొంగతనాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే వెంకటరమణ దంపతులను ఎంచుకున్నారు. వారి వద్ద ఉన్న బంగారం, నగదు కాజేయాలని ఫ్లాన్ చేశారు. పక్కా స్కెచ్ వేసి ఇంట్లో అద్దె దిగుతున్నట్లు నటించారు. అనుకున్నట్లుగానే వృద్ధ దంపతులను హతమార్చి, బంగారం, నగదుతో ఉడాయించారు.
సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా షేక్ అబీద్ తోపాటు సురేష్, శబీనా, హుస్సేన్ బీ, అనిల్ కుమార్, జమాల్ బీ, మణికంఠ, అమీద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై 220,302,201,379,34 ఐపీసీ కింద కేసు నమోదు చేసినట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. గతంలో హత్య కేసులో ఉన్న అబీద్ బెయిల్ మీద బయటకు వచ్చి పేరు మార్చుకుని బయట తిరుగుతున్నాడని ఆయన తెలిపారు. అబీద్ నాలుగు నెలల క్రితం కోదాడ లో హుస్సేన్ బీ ఇంటి పక్కన ఇల్లు అద్దెకు తీసుకుని ఉండి ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. మణికంఠ అనే వ్యక్తి దగ్గర తప్పుడు చిరునామాతో ఐదు సిమ్ కార్డులు తీసుకొన్నట్లు సీపీ తెలిపారు.
నేలకొండపల్లిలో జమాల్ బీ పరిచయం కావడంతో ఆమె ద్వారా వెంకట రమణ కుటుంబం గురించి తెలిసుకున్నారు. వెంకట రమణ గతంలో బియ్యం వ్యాపారం చేశాడు. ఇంటిలో ఒంటరిగానే దంపతులు ఉంటారు. వీరి దగ్గర డబ్బు, నగలు ఉంటాయని భావించి, పథకం రచన చేశారు. వారి ఇంటికి వెళ్లి అద్దెకు ఇల్లు కావాలని రూ. 5 వేలు అడ్వాన్స్ ఇచ్చారు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ఇద్దరు మహిళలు షబీనా, హుస్సేన్ బీని ఇంట్లోకి పంపించారు.
ఆరోజు కుదరక పోవడంతో మరుసటి రోజు రాత్రి పది గంటల సమయంలో ఇంటి వెనుక నుంచి వచ్చిన అబీద్, సురేష్ లు వెంకటరమణ, ఆయన భార్య కృష్ణకుమారి నోరు మూసి హత్య చేసి బంగారం ఎత్తుకెళ్లారు..ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ఇంటి చుట్టూ కారం చల్లి పారిపోయారు. డిసెంబర్ 12వ తేదీన వాహనాల తనిఖీ చేస్తుండగా హంతకులను పట్టుకున్నామని సిపి మీడియాకు తెలిపారు. వారి వద్ద నుంచి ఎనిమిది తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఇళ్ళు అద్దెకు ఇచ్చేటప్పుడు తెలిసిన వాళ్లకు మాత్రమే ఇవ్వాలని సీపీ సూచించారు. ఎక్కువ డబ్బులు కోసం తెలియని వాళ్లకు అద్దెకు ఇవ్వద్దని ఆయన తెలిపారు. ఈ కేసులో హంతకులను పట్టుకున్న పోలీసులకు మెమోంటో ఇచ్చి అభినందించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..