Munugodu: పోస్టల్ బ్యాలెట్ కు రూ.పది వేలు.. జోరుగా సాగుతున్న ప్రలోభాలు..

|

Oct 28, 2022 | 6:46 AM

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగడంతో అక్కడ గెలుపు..

Munugodu: పోస్టల్ బ్యాలెట్ కు రూ.పది వేలు.. జోరుగా సాగుతున్న ప్రలోభాలు..
Postal Ballot
Follow us on

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అన్ని పార్టీలు గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగడంతో అక్కడ గెలుపు ఎవరిదనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటుండగా తాజాగా.. ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు ప్రలోభాలకు తెర లేపారు. మద్యం, బిర్యానీ పంపిణీ సర్వసాధారణమైపోయాయి. కొన్ని చోట్ల ఓటుకు భారీ మొత్తం ముట్టజెబుతున్నారనే వార్తలూ వినిపిస్తున్నాయి. ఒక పార్టీ ఇచ్చిన దాని కంటే ఎక్కువగా ఇచ్చేందుకు మరో పార్టీ వారు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో పోస్టల్ బ్యాలెట్ కూ గిరాకీ ఏర్పడింది. వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశాన్ని నేతలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలో 128 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉండగా బుధవారం వరకు 88 నమోదయ్యాయి. కొన్ని ఓట్లను ఓ ప్రధాన పార్టీ రూ.2 వేలు నుంచి రూ.3 వేలకు, మరో పార్టీ రూ.5 వేలతో కొన్నట్లు ప్రచారం జరిగింది.

అయితే.. ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పోస్టల్ బ్యాలెట్ కు ఇచ్చే మొత్తం పెరుగుతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. గురువారం రెండు ప్రధాన పార్టీలూ కొందరికి ఓటుకు రూ.5 వేల చొప్పున రూ.పదేసి వేలు ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. గురువారం ఇక్కడ మరో 36 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదయ్యాయి. కాగా.. దీపావళి పర్వదినం సందర్బంగా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు మద్యం, మాంసం, టపాసులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఓట్లు రప్పించుకునేందుకు ప్రలోభాలు ఏ మేరకు జరుగుతున్నాయో ఈ పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు.

మరోవైపు.. మునుగోడు బై పోల్ పై బెట్టింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడి ఉప ఎన్నిక పై భారీగా బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. గెలుపోటములపై ఇప్పటికే వందల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరిగింది. గ్రౌండ్ రియాల్టీ కోసం బెట్టింగ్ బృందాల నిరంతరం సర్వే నిర్వహిస్తుండటం గమనార్హం. ఓటరు నాడీ ని తెలుసుకోడానికి ఆ రాష్ట్రానికి చెందిన యువకులు మునుగోడులో చక్కర్లు కొడుతున్నారు. మారుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు ముఠాకు చేరవేస్తూ పందేలకు పాల్పడుతున్నారు. అంతే కాకుండా స్థానికంగానూ బెట్టింగ్ లు కొనసాగుతుండటం విస్తుగొలుపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..