Crime News: పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేస్తున్నారు.. ఇది దేనికి సంకేతం?

మనిషి మృగంలా మారుతుంటే.. బంధాలు, అనుబంధాల బందాలు తెగిపోతున్నాయి. మానవ సంబంధాలు మసైపోతున్నాయి. ఏకాకి జీవితం నాది అంటూ కుటుంబానికి, కుటుంబ బంధాల్లోని మాధుర్యానికి నోచుకోక కొందరు అలమటిస్తుంటే.. పరాయి మనుషుల మోజులో పడి.. కుటుంబాల్ని సొంత చేతులతోనే సర్వనాశనం చేసుకునేవాళ్లు మరికొందరు.

Crime News: పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేస్తున్నారు.. ఇది దేనికి సంకేతం?
Crime News
Follow us

|

Updated on: Jun 16, 2024 | 3:58 PM

మనిషి మృగంలా మారుతుంటే.. బంధాలు, అనుబంధాల బందాలు తెగిపోతున్నాయి. మానవ సంబంధాలు మసైపోతున్నాయి. ఏకాకి జీవితం నాది అంటూ కుటుంబానికి, కుటుంబ బంధాల్లోని మాధుర్యానికి నోచుకోక కొందరు అలమటిస్తుంటే.. పరాయి మనుషుల మోజులో పడి.. కుటుంబాల్ని సొంత చేతులతోనే సర్వనాశనం చేసుకునేవాళ్లు మరికొందరు. పేట్రేగిపోతున్న క్రైమ్‌ కల్చర్‌లో మానవ సంబంధాలనే మాట మంటగలిచి పోతోంది. క్షణికావేశంతో, ఐహిక సుఖాల కోసం నేరాలకు పాల్పడి, తమ వాళ్లను తామే మట్టుబెట్టడం దేనికి సంకేతం?

కనిపెంచిన తల్లి, కట్టుకున్న భార్య, సర్వస్వం అనుకున్న భర్త… దీపం వెలిగించి… కుటుంబాల్ని బతికించి వెలుగులు ఇవ్వాల్సిన ఈ బంధాలే బతుకుల్ని బండ బారుస్తున్నాయి. నిండు జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నాయి. పంచభూతాల సాక్షిగా ఏర్పడిన బంధాల విలువను మర్చిపోయి, మానవ సంబంధాలు మట్టిలో కలిపేసి.. తమ జీవితాలను తామే కాలరాసుకుంటున్న సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీచర్ ఉద్యోగం చేసుకుంటూ కూతురిని ఉన్నత స్థానంలో చూసుకోవాలని పరితపిస్తున్న తండ్రిని.. ఆ కన్న కూతురే కాటేసింది. ప్రియుడి మోజులో పడి.. కన్న తండ్రినే కడతేర్చింది పాతికేళ్ల హర్షిత. మదనపల్లి ఎగువ కురువ వంకలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో టీచర్ దొరస్వామి ఫ్యామిలీ నివాసం ఉంటోంది. రెండేళ్ల క్రితం దొరస్వామి భార్య లత అనారోగ్యంతో మృతి చెందడంతో ఇంట్లో తండ్రి, కూతురు మాత్రమే ఉంటున్నారు. అయితే 25 ఏళ్ల హర్షిత ఇద్దరు అబ్బాయిలతో ప్రేమాయణం నడుపుతోంది. ఈ విషయం తెలిసిన దొరస్వామి.. హర్షితకు కుప్పంలో పెళ్లి సంబంధం చూశాడు. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని హర్షిత.. ప్రియుడితో కలిసి ఇంట్లోనే హత్య చేయించింది. బీఈడీ చదివిన హర్షిత.. తండ్రినే చంపి ఇప్పుడు కటకటాలపాలైంది.

ఆదిలాబాద్‌‌లోనూ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి జీవితం విషాదాంతమైంది. గాదిగూడ మండలం అర్జుని కొలాంగూడ శివారులో జాదవ్ గజానంద్ అనే 40 ఏళ్ల ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురయ్యారు. తలపై బండరాయితో కొట్టి.. కిరాతకంగా చంపారు. ఈ హత్య కేసును విచారించేకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాథోడ్ రమేష్ అనే ప్రియుడి మోజులో పడిన భార్య విజయలక్ష్మి.. తన అపవిత్ర బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో భర్తనే హత్య చేయించి ఏమీ తెలీనట్టుగా వ్యవహరించింది. అయితే విజయలక్ష్మికి ప్రియుడు రాథోడ్ రమేష్‌కి మధ్య ఫోన్ సంభాషణలు, మెసేజ్‌ల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు.

పరాయి బంధం కోసం.. పేగు బంధాన్నే తెంచేసిన ఓ కసాయి తల్లి ఉదంతం.. పటాన్‌చెరులో వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటకు చెందిన కర్రె స్వాతి కుటుంబం ఆర్సీపురంలో నివాసం ఉంటోంది. భర్త రాజు చనిపోవడంతో.. కుమారుడు విష్ణువర్థన్, కుమార్తెతో కలిసి స్వాతి ఆర్సీపురంలోనే ఉంటోంది. ఆమెకు అదే బస్తీలో ఉంటున్న ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం చీమకుర్తికి చెందిన దొంతు అనిల్‌‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఈ విషయం తెలిసిన కొడుకు… తల్లిని వారించాడు. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల పదవ తేదీన కూడా కొడుకు నిలదీశాడు. వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని సూచించాడు. కానీ కన్న కొడుకు కంటే అనిల్‌తో అపవిత్ర బంధమే ఆ తల్లికి ముఖ్యమైంది. ఆ చిన్నారిని గొంతు నులిమి చంపేసింది. ఆ తర్వాత టవల్‌తో బాలుడి మెడకు ఉరేసి కిటికీకి వేలాడదీసింది. బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అర్థరాత్రి ప్రియుడు అనిల్‌తో కలిసి స్కూటీ మీద కుమారుడి డెడ్ బాడీ తీసుకెళ్లిన స్వాతి.. ముత్తంగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు‌ పక్కన పొదల్లో పడేసింది. ఉదయాన్నే డెడ్‌బాడీని గుర్తించిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకుని.. తమదైన స్టైల్‌లో విచారించడంతో.. కన్నతల్లి కర్కశత్వం వెలుగులోకి వచ్చింది.

ఇక ఖమ్మం పట్టణానికి చెందిన భవానీది మరో విచిత్రమైన గుండె గోస. పుట్టుకతో వచ్చిన లోపం ఆమె పాలిట శాపంగా మారింది. అత్తింటి వేధింపులతో అరణ్య రోధన అనుభవిస్తోంది. ఖమ్మం పట్టణానికి చెందిన భవానీకి, బోనకల్లుకు చెందిన భాస్కరాచారికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే భవానీకి అందరిలాగా ఎడమవైపు కాకుండా కుడివైపున గుండె ఉంది. పెళ్లైన 16రోజులకు అత్తింటి వారికి ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి ఆమెకు గుండె గోస మొదలైంది. భవానీని భర్త భాస్కరాచారి దూరం పెట్టారు. తనకు న్యాయం చేయాలని అత్తమామలను వేడుకున్నా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని పోలీసుల దగ్గరకు తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయింది. భాస్కరాచారి తండ్రి హెడ్ కానిస్టేబుల్ కావడంతో పోలీసుల దగ్గర న్యాయం జరగడం లేదని భవానీ కోర్టుకు వెళ్లింది. గుండె కుడివైపుకు ఉన్నా కాపురం చేయొచ్చని కోర్టు తీర్పు చెప్పింది. ఆ కోర్ట్ తీర్పును పట్టుకుని భర్త కోసం అత్తవారింటికి భవానీ వెళ్తే.. తన మామ తీవ్రంగా కొట్టడం అత్యంత బాధాకరం.

మనిషికీ మనిషికీ మధ్య దూరం తగ్గించాల్సిన రక్త సంబంధాలు.. సరికొత్త రక్తచరిత్రలకు సిరాక్షరాలుగా మారుతున్నాయి. అయినవాళ్లనే నెత్తుటి మడుగులో చూడాల్సిన ఖర్మలు దాపురిస్తున్నాయి. మనవాళ్లను చంపడమంటే మనల్ని మనమే చంపుకోవడం.. మానవ సంబంధాలకు పాతరెయ్యడం. క్షణికావేశం వదిలిపెట్టి.. అరక్షణం ఆలోచిస్తే చాలు.. ఈ రక్తపాతాలు ఆగిపోతాయి. కానీ.. ఆలోచించేదెవ్వరు..?

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles