రైతుల కోసం వినూత్న ఆవిష్కరణ… సరదా చేసిన వస్తువుకు పేటెంట్ సొంతం చేసుకున్న యువతి

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏదైనా వినూత్న ఆలోచనలు, కొత్త ఆవిష్కరణ, ఉత్పత్తులకు సంబంధించి పేటెంట్ హక్కు లభిస్తుంది. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడు రూపొందించిన ఓ ప్రాజెక్టుకు పేటెంట్ హక్కు లభించింది.

రైతుల కోసం వినూత్న ఆవిష్కరణ... సరదా చేసిన వస్తువుకు పేటెంట్ సొంతం చేసుకున్న యువతి
Farmers Stick
Follow us
M Revan Reddy

| Edited By: Balaraju Goud

Updated on: Jun 16, 2024 | 5:04 PM

విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించడానికి వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఏదైనా వినూత్న ఆలోచనలు, కొత్త ఆవిష్కరణ, ఉత్పత్తులకు సంబంధించి పేటెంట్ హక్కు లభిస్తుంది. పాఠశాల విద్యార్థినిగా ఉన్నప్పుడు రూపొందించిన ఓ ప్రాజెక్టుకు పేటెంట్ హక్కు లభించింది. అది కూడా చిన్న వయసులోనే తన చుట్టూ ఉన్న పరిస్థితులకు సంబంధించిన కొత్త ఆవిష్కరణకు పేటెంట్ సొంతం అయ్యింది. పేటెంట్ హక్కు లభించిన కొత్త ఆవిష్కరణ ఏంటి..? ఎవరికి లభించిందో తెలుసుకుందాం..

యాదాద్రి జిల్లా బీబీనగర్‌కు చెందిన పరుశురాములు కవిత దంపతులది నిరుపేద కుటుంబం. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ తమ కూతురు శ్రావణిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివించాడు. మొదటి నుంచి శ్రావణి.. ఆటపాటల్లో చురుకుగా ఉండేది. శ్రావణి తొమ్మిదో తరగతి చదివే సమయంలో పాఠశాలలో సైన్స్ ఫెయిర్ ను నిర్వహించారు. వినూత్నమైన ప్రాజెక్ట్ ను తయారు చేయాలని శ్రావణికి టీచర్స్ సూచించారు. దీంతో తన తండ్రితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వృద్ధులు రాత్రివేళల్లో నడిచేటప్పుడు, పంట పొలాల్లో తిరిగేటప్పుడు పాముకాటుకు గురై ప్రాణాలు పోగొట్టుకోవడం కళ్ళారా చూసిన శ్రావణిని చలించిపోయేది. రైతుల ప్రాణాలను రక్షించేందుకు చేతి కర్ర యంత్రాన్ని రూపొందించింది.

రైతుల ప్రాణాలను రక్షించే చేతి కర్ర యంత్రం..

శ్రావణి రూపొందించిన యంత్ర పరికరం అడుగు భాగంలో ఒక వైబ్రేటర్, దానిపైన బజర్, టార్చ్ లైట్, మధ్యలో బ్యాటరీని అమర్చుతారు. దీన్ని పట్టుకుని అడుగులు వేసినప్పుడు వైబ్రేటర్ ఆన్ అవుతుంది. కర్ర పెట్టిన స్థలం నుంచి రెండు మీటర్ల విస్తీర్ణంలో ప్రకంపనలు వస్తాయి. ఆ ప్రకంపనలకు పాములు, ఇతర విష పురుగులు దూరంగా వెళ్లిపోతాయి. దీనికి అమర్చిన బజర్ సౌండ్‌తో పంట పొలాల్లోకి వచ్చిన అడవి పందులు, పిట్టలు పారిపోతాయి. యంత్ర పరికరం రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది.

వైజ్ఞానిక ప్రదర్శనల్లో సత్తా చాటిన శ్రావణి…

విద్యార్థినిగా శ్రావణి ఆవిష్కరించిన చేతి కర్ర యంత్రం జిల్లా, రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని సత్తా చాటింది. 2019లో నిర్వహించిన జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీల్లో ఆరో స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా రాష్ట్రపతి భవన్, జపాన్ లో నిర్వహించిన ప్రదర్శనలకు ఎంపికైంది. శ్రావణి ప్రస్తుతం బీహార్ లోని పాట్నా ఐఐటీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది.

చేతి కర్ర యంతానికి పేటెంట్ హక్కు…

9వ తరగతి విద్యార్థినిగా రూపొందించిన చేతి కర్ర యంత్రానికి కొద్ది రోజుల క్రితం పేటెంట్ హక్కు లభించింది. జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిన చేతి కర్ర యంత్రానికి పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిశీలించిన కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ పేటెంట్ అధికారులు ఎంత పరికరంపై శ్రావణికి పేటెంట్ హక్కును కల్పించారు. రాత్రివేళ రైతుల ప్రాణాలను కాపాడే ఈ చేతి కర్ర యంత్ర పరికరం తయారీకి రెండు నుంచి మూడు వేల రూపాయలు ఖర్చవుతుందని శ్రావణి తెలిపింది. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని కొత్త ఆవిష్కరణకు కృషి చేస్తానని శ్రావణి చెబుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..