AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు 12 రోజుల తర్వాత భారీ దొంగ తనాన్ని ఛేదించారు జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలను‌ జల్లెడ పట్టిన పోలీసులు.. అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తులను‌ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది..

ఇంటి తాళాలు పగలగొట్టి సినిపక్కీలో భారీ చోరీ.. 12 రోజుల తర్వాత ఎట్టకేలకు చిక్కిన అన్నదమ్ములు!
Mancherial House Robbery Case
Naresh Gollana
| Edited By: |

Updated on: May 04, 2026 | 8:29 PM

Share

మంచిర్యాల, మే 4: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌలమేశ్వరీ కాలనీలో గత నెల 23న రాత్రి భారీ చోరీ జరిగింది. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి ముదాం నాగయ్య ఇంట్లో చోరీకి పాల్పడ్డ గుర్తు తెలియని దుండగులు.. 32.5 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి రూ. 1.50 లక్షల నగదు మాయం చేశారు. బందువుల ఇంటికి ఓ కార్యక్రమానికి‌ వెళ్లి‌వచ్చేసరికి ఇళ్లంతా గుళ్ల చేశారు. తాళాలు పగలగొట్టి దర్జాగా దోపిడికి పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఎట్టకేలకు 12 రోజుల తర్వాత భారీ దొంగ తనాన్ని ఛేదించారు జిల్లా పోలీసులు. జిల్లా కేంద్రంలోని సీసీ కెమెరాలను‌ జల్లెడ పట్టిన పోలీసులు.. అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తులను‌ అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది.

ఇద్దరు అన్నదమ్ములు.. పక్కా స్కెచ్

మహారాష్ట్ర లోని చంద్రపూర్ కు చెందిన ఆశిష్ శ్రీనివాస్, ఆకాష్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఈ దోపిడికి పాల్పడట్టు మంచిర్యాల డీసీపి బాస్కర్ వివరాలు వెల్లడించారు. గత నెల 22 న నాగయ్య అనే రిటైడ్ సింగరేణి కార్మికుడు ఇంట్లో దొంగతనం జరిగిందని పోలీసులకు పిర్యాదు అందడంతో రెండు స్పెషల్ పోలీస్ టీమ్ లను ఏర్పాటు చేసి 12 రోజులలోనే కేసును చేధించామని తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అన్నదమ్ములు జల్సాలకు అలవాటు పడి బెట్టింగ్ యాప్ లలో డబ్బులు పెట్టి తీవ్రంగా నష్టపోయి ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఈ దొంగతనానికి పాల్పడ్డ నిందితులను అరెస్టు చేశామన్నారు డీసీపీ. నిందితుల వద్ద నుండి 311 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఒక కిలో వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో 67 గ్రాముల బంగారు ఆభరణాలను చంద్రపూర్ లోని ముత్తూట్ ఫైన్ క్రాప్ కంపెనీలో తాకట్టు పెట్టి రూ.6,76,000 గోల్డ్ లోన్ తీసుకున్నట్టుగా గుర్తించామన్నారు.

బాధితుడి ఇంట్లో దొంగిలించిన 1.5 లక్షల నగదును కేవలం మూడు రోజుల్లోనే జల్సాలకు ఖర్చు చేశారని డీసీపీ తెలిపారు. త్వరలోనే నిందితులు గోల్డ్ లోన్ పెట్టిన వస్తువులను స్వాధీనం చేసుకుంటామని… కోర్టు ముందు ప్రవేశపెట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. వేసవికాలంలో ఎవరైనా ఊర్లోకి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని ఇంట్లో విలువైన వస్తువులను కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా సంచరించిస్తున్నట్లయితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంచిర్యాల డీసీపీ బాస్కర్.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us