
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా రంగం సిద్ధం చేస్తోంది. కేబినెట్ మీటింగ్ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాబోతోంది. రిజర్వేషన్ల వివాదాన్ని అధిగమించేలా ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లబోతోంది? అన్నదీ ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లేందుకు ఇప్పటికే గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో సర్కార్ నిర్ణయం తీసుకుంది. బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడం సాధ్యం కాకపోవడంతో పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది.
ఇక లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం జీఓ ఇచ్చింది. కానీ హైకోర్టు కొట్టివేయడంతో లోకల్ బాడీ ఎన్నికలకు బ్రేక్ పడింది. నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయినప్పటికీ కోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధులు దాదాపు 3 వేల కోట్లు వృధా కాకుండా పోవాలంటే లోకల్ బాడీ ఎన్నికలు జరపాల్సిన పరిస్థితి ఉందని గత మంత్రివర్గంలో స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం గతంలో ఇచ్చిన రిజర్వేషన్లను సరి చేయాలని డెడికేటెడ్ కమిషన్‌కు సూచించింది. డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన ఆ రిపోర్టుపై కేబినెట్ పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది.
ఇక మహిళలకు రిజర్వ్డ్ చేసిన స్థానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి. ఈ నెల 25 వ తేదీన జరగనున్న క్యాబినెట్ మీటింగ్ నాటికి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఫార్మాలిటీస్‌ను ప్రభుత్వం పూర్తి చేయనుంది. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ ముగిసిన తర్వాత ఈ నెల 26 లేదా 27న గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే విధంగా కసరత్తు జరుగుతోంది. డిసెంబర్ మొదటి వారం నుంచి రెండవ వారం లోపల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కారణంగా ఊపు మీదున్న కాంగ్రెస్.. సర్పంచ్ ఎన్నికల్లో అదే జోరును కొనసాగిస్తుందా ? రిజర్వేషన్ల అంశంపై విపక్షాల నుంచి విమర్శలు, అభ్యంతరాలను ఫలితాల ద్వారా అధిగమిస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..