Telangana: మానవత్వం చాటుకున్న సర్పంచ్.. ఇతను చేసిన పనికి చేతులెత్తి మొక్కాల్సిందే..
తెలిసిన వారికి సాయం చేయడం మంచితనం! తెలియని వారికి సాయపడడం మానవత్వం! ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యాచకురాలికి అంతిమసంస్కారాలు నిర్వహించి మానవత్వం ముందు తన పర భేదం..

తెలిసిన వారికి సాయం చేయడం మంచితనం! తెలియని వారికి సాయపడడం మానవత్వం! ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన యాచకురాలికి అంతిమసంస్కారాలు నిర్వహించి మానవత్వం ముందు తన పర భేదం ఉండదని నిరూపించాడు ఓ సర్పంచ్. పాడె మోసి మరీ యాచకురాలి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని బొద్దుగొండ గ్రామంలో ఈరమ్మ అనే 65 ఏళ్ల వృద్ధురాలు గత కొన్ని సంవత్సరాల నుంచి జీవిస్తోంది. ఫిబ్రవరి 5 రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఈరమ్మ మృతి చెందడంతో సర్పంచ్ ముక్కా లక్ష్మణ్ రావు, తోడబుట్టిన అన్నలా దగ్గరుండి, అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.
చనిపోయింది యాచకురాలే కదా అని లైట్ తీసుకోలేదు. వృద్ధురాలి మృతి గురించి తెలియగానే పరుగు పరుగున ఘటనాస్థలికి చేరుకొని ఆమె మృతదేహాన్ని ఫ్రీజర్‌లో పెట్టించి, మర్నాడు ఉదయాన్నే అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయించారు. సంప్రదాయంగా మృతదేహాన్ని బండిపై ఊరేగింపుగా శ్మశానానికి తీసుకెళ్లారు. డప్పుల దరువుతో, బాణాసంచా శబ్దాల నడుమ శ్మశానానికి చేరుకుని, శాస్త్రోక్తంగా దింపుడు కళ్ళం నిర్వహించారు.
ఇంత భక్తిశ్రద్ధలతో అంత్యక్రియలు పూర్తి చేసిన ఆయనను చూసి, దగ్గరివాళ్ళెవరో పోయారని అనుకున్నారు అంతా… నిజానికి చనిపోయిన మనిషి తో సర్పంచ్ కు ఎలాంటి బంధుత్వం లేదు. కానీ ఆత్మబంధువై అంతిమ కార్యక్రమం నిర్వహించాడు. అలా ఎందుకు అని ప్రశ్నిస్తే.. సాటి మనిషిగా అది నా బాధ్యత, ధర్మం అన్నారు.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..