Telangana: మేడారంకు పోటెత్తిన భక్తజనం.. ఆదివారం ఒక్క రోజే ఏకంగా.! ఎంతమంది వచ్చారంటే.?

| Edited By: Ravi Kiran

Dec 25, 2023 | 1:58 PM

2024 మేడారం మహాజాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మహాజాతర తేదీలను ఖరారు చేశారు. కానీ భక్తజనం మాత్రం ముందే లక్షలాదిగా మేడారంకు తరలి వస్తున్నారు. మూడు రోజులు వరుసగా సెలవుదినాలు రావడంతో లక్షల సంఖ్యలో భక్తులు మేడారంకు క్యూ కట్టారు.

Telangana: మేడారంకు పోటెత్తిన భక్తజనం.. ఆదివారం ఒక్క రోజే ఏకంగా.! ఎంతమంది వచ్చారంటే.?
Medaram Jatara
Follow us on

2024 మేడారం మహాజాతరకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మహాజాతర తేదీలను ఖరారు చేశారు. కానీ భక్తజనం మాత్రం ముందే లక్షలాదిగా మేడారంకు తరలి వస్తున్నారు. మూడు రోజులు వరుసగా సెలవుదినాలు రావడంతో లక్షల సంఖ్యలో భక్తులు మేడారంకు క్యూ కట్టారు. సమ్మక్క-సారక్క దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఆదివారం ఒక్కరోజే సుమారు రెండు లక్షల మంది భక్తులు మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకున్నారు. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు తరలివచ్చి సమ్మక్క-సారక్క దేవతలు దర్శించుకుంటున్నారు. సమ్మక్క-సారక్క దేవతలకు ప్రీతికరమైన నిలువెత్తు బెల్లం మొక్కులు సమర్పిస్తున్నారు.

రోజుకు లక్షకు పైగానే భక్తులు సమ్మక్క సారక్క దేవతలు దర్శించుకోవడం చర్చగా మారింది. జాతరకి ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ భక్తులు ఇంత పెద్ద సంఖ్యలో ముందే ఎందుకు తరలివస్తున్నారని చర్చ జరుగుతుంది. అయితే జాతర సమయం వరకు మళ్లీ కరోనా కేసులు పెరిగిపోతే రావడం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకే ముందస్తుగా వచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నామని కొందరు స్థానికులు అంటున్నారు.

మరికొందరు స్థానికులు మాత్రం జాతర సమయంలో లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. జాతర సమయంలో తోపులాటలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబ సమేతంగా ఆ సమయంలో దర్శనం చేసుకోవడం ఇబ్బందికరంగా ఉంటుందని అందుకే ముందే వచ్చి కుటుంబ సమేతంగా మొక్కులు చెల్లించుకుంటున్నామని అంటున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన బెల్లం మొక్కులు సమర్పించడంతో పాటు కోళ్లు, మేకలను మొక్కులు చెల్లించుకుంటున్నారు

అయితే జాతరకు ముందుగానే భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. జాతరకు వచ్చే నాలుగు ప్రధాన రహదారులలో ప్రత్యేకంగా పార్కింగ్‌కు కూడా ఏర్పాటు చేశారు. స్థానిక మంత్రి సీతక్క కూడా ఈ రోజు మేడారంలో పర్యటించారు. జాతర అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. నార్లాపూర్ నుండి వచ్చే రహదారి మొత్తం పాడైపోవడంతో వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్కడి నుంచి నేరుగా చిలకలగుట్ట వైపు వెళ్లిన సీతక్క ఆ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పనుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా సహించే ప్రసక్తి లేదని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే జాతరను అన్ని శాఖలు సమన్వయంతో సక్సెస్ చేయాలని సూచించారు.