Scam: బతికున్న మనిషిని చనిపోయిందన్నారు.. ఆపై వడ్ల డబ్బులంటూ నమ్మించారు.. చివరికి వారి ఎంట్రీతో..

|

Jul 23, 2021 | 9:47 AM

Scam: రైతుల పేరుతో కొందరు నేతలు ప్రభుత్వానికే టోకరా పెడుతున్నారు. బతికున్న మహిళా రైతును చనిపోయినట్లుగా చిత్రీకరించి...

Scam: బతికున్న మనిషిని చనిపోయిందన్నారు.. ఆపై వడ్ల డబ్బులంటూ నమ్మించారు.. చివరికి వారి ఎంట్రీతో..
Death Certificate
Follow us on

Scam: రైతుల పేరుతో కొందరు నేతలు ప్రభుత్వానికే టోకరా పెడుతున్నారు. బతికున్న మహిళా రైతును చనిపోయినట్లుగా చిత్రీకరించి.. డబ్బులు కాజేశారు. పైగా వడ్ల డబ్బులు పొరపాటుగా ఖాతాలో పడ్డాయంటూ బాధితులను నమ్మించి విత్ డ్రా చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామానికి చెందిన మహిళ రైతు చంద్రమ్మకు కొంత మొత్తంలో వ్యవసాయ భూమి ఉంది. ఆమెకు రైతుబంధు డబ్బులు కూడా అందుతున్నాయి. అయితే, తాజాగా చంద్రమ్మ చనిపోయినట్లుగా ‘రైతు బంధు’ గ్రామ కో ఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి.. ఆమే పేరిట డెత్ సర్టిఫికెట్ సృష్టించాడు. ఆపై ఆమే పేరిట రైతుబీమా క్లెయిమ్ కోసం అధికారులకు దరఖాస్తు చేశాడు. అధికారులు కూడా ఎలాంటి విచారణ లేకుండానే క్లెయిమ్ కోసం పంపించారు. దాంతో ఉన్నతాధికారులు.. రైతు బీమా ను చంద్రమ్మ కొడుకు బాలయ్య ఖాతాలో జమ చేశారు.

అయితే, ఇప్పుడే అసలు కథ మొదలు పెట్టాడు. రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్ రాఘవేందర్ రెడ్డి. బాలయ్య ఖాతాలో వడ్ల డబ్బులు పడ్డాయని నమ్మించి అతడి ఖాతా నుంచి రాఘవేందర్ రెడ్డి పలు దఫాలుగా డబ్బులు విత్ డ్రా చేయించారు. అయితే, రైతు బీమా డబ్బులు దుర్వినియోగం అయినట్లు తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు.. గ్రామానికి వచ్చి పంచాయతీలో రికార్డులను పరిశీలించారు. అప్పుడు అసలు గుట్టు రట్టయ్యింది. నకిలీ పత్రాలు సృష్టించి బీమా డబ్బులను డ్రా చేసుకున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో రాఘవేందర్ రెడ్డితో పాటు.. చంద్రమ్మ కొడుకు బాలయ్యపైనా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read:

All India Radio: మనదేశంలో మొదటి రేడియో స్టేషన్ ప్రారంభం ఎప్పుడు అయిందో తెలుసా? ఆల్ ఇండియా రేడియో ఎలా ఏర్పడింది తెలుసుకోండి!

China floods: చైనాలో వర్ష బీభత్సం..!! వరదలో చిక్కుకున్న ట్రైన్‌..!! 12 మంది మృతి..!! వీడియో

Jeff Bezos: జెఫ్ అంతరిక్ష యాత్రపై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఫన్నీ మీమ్స్.. వీడియో