నిజామాబాద్ జిల్లా ఇందల్వాయిలో దారుణం చోటు చేసుకుంది. ఓ భార్య కట్టుకున్న భర్తపైనే ఘాతుకానికి పాల్పడింది. హంతులకు సుపారీ ఇచ్చి మరీ భర్తను చంపించింది. భర్తను చంపించేందుకు అవసరమైన డబ్బుల కోసం ఏకంగా తన చెవి కమ్మలను విక్రయించింది. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఇంతకీ ఆమె.. తన భర్తను ఎందుకు చంపించింది? అంత కోపం ఎందుకు వచ్చింది? అసలు ఇంతటి దారుణానికి పాల్పడటానికి కారణం ఏంటి? వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గోపాల్, పీరుబాయ్ దంపతులు. కొన్నేళ్ల క్రితం వీరికి పెళ్లి అయ్యింది. అయితే, మద్యానికి బానిస అయిన గోపాల్.. తన భార్య పీరు బాయిని నిత్యం వేధించేవాడు. దాంతో విసిగి వేసారిపోయిన పీరుబాయి.. తన భర్తను చంపించాలని ప్లాన్ వేసింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను కలిసింది. తన బంగారు కమ్మలను అమ్మి సుపారీ గ్యాంగ్‌కు రూ. 2 లక్షలు ఇచ్చింది పీరుబాయి. ఇంకేముంది.. హంతకులు చందర్, మహేష్ పక్కా ప్లాన్ వేసి, డొంకల్ అడవిలో గోపాల్‌ను కిరాతకంగా హత్య చేశారు. గత నెల 30న హత్య జరగగా.. తాజాగా కేసును ఛేదించారు పోలీసులు.
గోపాల్‌ను కట్టుకున్న భార్యే చంపించిందని తెలిసి అవాక్కైన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారంతో.. హత్య చేసిన చందర్, మహేష్‌లను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..