ఇంద్రవెల్లి, ఆగస్టు 13: అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఆదివాసి గ్రామం డోంగార్‌గావ్ వరుసగా వార్తల్లో నిలుస్తుంది. అక్కడి హనుమాన్ దేవాలయంలోని హనుమంతుడికి చెందిన కళ్లను ఎమ్మెల్యే రేఖానాయక్ తీసుకెళ్లడం… అంతలోనే ఆ గ్రామ పెద్దల కంటి చూపును కోల్పోవడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే వెండి కళ్లను తీసుకెళ్లిన ఎమ్మెల్యే రేఖానాయక్ బంగారు కళ్ల ను దేవుడికి మొక్కుగా చెల్లిస్తానని చెప్పడంతో అంతలోనే ఆ కళ్ల వ్యవహారం రాజకీయ రచ్చకు దారి తీయడంతో దేవుడితో రాజకీయం వద్దంటూ ఆ కళ్లను తిరిగి గ్రామానికి పంపించింది ఎమ్మెల్యే రేఖానాయక్. అయితే ఎమ్మెల్యే పంపిన వెండి కళ్లు గతంలో తీసుకెళ్లిన వెండి కళ్ళు అవునో కాదో అంటూ అనుమాన వ్యక్తం చేస్తుంది అక్కడి యువత.
దేవుడికి అపచారం జరిగిందని.. ఇప్పటికే గ్రామంలో ఇద్దరి కళ్లు పోయాయని.. మరింత ఘోరం జరగక ముందే నివారణ పూజలు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో.. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు డోంగ్రేగావ్ గ్రామస్తులు సిద్ధమయ్యారు. అదే సమయంలో హనుమాన్ దేవాలయాన్ని శుభ్రం చేస్తున్న సమయంలో హఠాత్తుగా అక్కడ పాము ప్రత్యక్షమైంది. వెంటనే అక్కడి యువత ఆ పామును ఏమి అనకుండా పక్కకు తప్పుకున్నారు. తమపై కరుణ చూపేందుకే నాగోబా రూపంలో ఈ పాముకు ఇక్కడికి వచ్చిందని చర్చించుకున్నారు. పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు.
ఎమ్మెల్యే రేఖా నాయక్ మా గ్రామానికి వచ్చి మా దేవుడి కండ్లను తీసుకెళ్లడం కారణంగానే మాజీ పటేల్ మడావి దేవరావు కంటి చూపును కోల్పోయాడని.. రెండు రోజుల తర్వాత ప్రస్తుత పటేల్ పెందూరి బాబు సైతం కంటి చూపును కోల్పోయాడని.. మరో ముగ్గురు కళ్లు సరిగ్గా కనిపించడం లేదని.. దేవుడి కోపం కారణంగానే ఇలా జరుగుతుందని మా గ్రామానికి పట్టిన అరిష్టం పోవాలంటే హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయాలని నిర్ణయించుకున్నామని అదే సమయంలో ఆలయాన్ని శుభ్రం చేస్తుండగా ఆలయంలోకి పాము రావడం శుభసూచకమంటూ చెపుతోంది అక్కడి యువత. ఇకనైనా మా గ్రామంలో మంచి జరగాలని.. పటేళ్ల కు కంటి చూపు తిరిగి రావాలని కోరుకుంటోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.