
సత్తుపల్లి, అక్టోబర్ 6: చేతిలో కొబ్బరి కాయ.. పొలాల్లో బోర్ పాయింట్ ప్రాచీన విద్యతో గంగాజలం ఛాయలు కనుగొనేవారు. మహాశివుని జటాజూటం నుంచి పాతాళానికి ప్రవహించిన గంగాజలం ఛాయలు గుర్తించాలి అంటే మూడు కన్నులను పోలిన కొబ్బరి కాయ కావాల్సిందే. కొబ్బరి కాయపై ఉండే మూడు రంధ్రాలు మూడు నేత్రాలుగా భావిస్తారు. అలాంటి కొబ్బరి కాయలతో ఆధ్యాత్మిక ఆత్మ శుద్ధితో భూమిలోని గంగాజలం ఎక్కడ ఉందో గుర్తిస్తారు. ప్రాచీన కాలం నుంచి నేటి కంప్యూటర్ యుగంలో కూడా భూమిలో జలపాతం గుర్తించి బోరు బావులు వేయాలంటే శాస్త్రం ప్రకారం ఆనాటి నుంచి కొబ్బరి కాయతో నీళ్ళ జాడ తెలుసుకునేందుకు కొందరు ఒక విద్యగా గురువులు నుంచి నేర్చుకుంటున్నారు. అలా 40 ఏళ్ల క్రితం నేర్చుకున్న ఆ విద్యనే.. ఈ రోజుకు కూడా పంట పొలాలకు, ఇండ్లలో తాగు, సాగు నీరు కావాలంటే కొబ్బరి కాయ విద్య తెలిసి ఉండాల్సిందే మరి. కొబ్బరి కాయలతో బోరు బావులుకు పాయింట్ పెడుతున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన యార్లగడ్డ దయనంద స్వామి అనే ఒక పూజారి 38 ఏళ్లుగా అమ్మవారు ఆలయంలో పూజలు చేస్తూ అమ్మవారిని ఆవాహనం చేసుకుని తనకు వచ్చిన పాత కాలపు విద్యతో చుట్టూ పక్కన గ్రామాలలో 40 బోర్లకు పాయింట్లు వేశారు. ముందుగా తన ఆరేళ్ల వయసులో ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ బ్రహ్మానంద యోగి వద్ద నిష్ఠతో ఆధ్యాత్మిక విద్యలను నేర్చుకున్నాడు. ఆనాటి నుంచి తన గ్రామాల చుట్టుపక్కల బోరులకు నీళ్ళు పడాలంటే కొబ్బరి కాయ విద్యతో నీళ్ళ జాడ గుర్తించి బోరు బావులు పాయింట్ మార్కింగ్ వేస్తాడు. ముందుగా రెండు కొబ్బరి కాయలు చేతిలోకి తీసుకుని మహా శివుణ్ణి ఆరాధిస్తస్తూ గంగానమ్మ కు నమస్కరించి ఆత్మ శుద్ధితో కొబ్బరి కాయను అర చేతిలో ఉంచి నేలపై నీటి జాడకోసం తిరుగుతాడు.
భూమి లోపల నీళ్ళ ఆనవాళ్లు ఉన్న చోట చేతిలోని కొబ్బరి కాయ పైకి నిలబడుతుంది. దీని ఆధారంగా నంద స్వామి ఆ ప్రాంతంలో బోరు వేసేందుకు మార్కింగ్ చేస్తాడు. తాను పెట్టిన బోరు పాయింట్ లో ఎంత మేరకు జలపాతం ఉంటుందో తెలుసుకునేందుకు తాను మరో కొబ్బరి కాయ పై అరికాళ్ళు నేలకు తాక కుండా కూర్చుంటాడు. తన తల పై చెయ్యి తో తాకిన వ్యక్తి మార్కింగ్ చేసిన మరో కొబ్బరి కాయ వద్దకు వెళ్ళినప్పుడు కొబ్బరి కాయ పై కూర్చున్న వ్యక్తి ఎంత ఫోర్స్ గా గిర్రు న తిరిగితే అంత ఎక్కువగా జలం ఉన్నట్టుగా గ్రహిస్తారు.
ఏది ఏమైనా సాంకేతికంగా ఎంతో పరిజ్ఞానం సాధించిన ఇంకా పల్లెల్లో ఇలాంటి పురాతన విద్యలు అరకొరగా కనిపిస్తూనే ఉన్నాయి. అయితే రోజు రోజుకు సాంకేతిక పరిజ్ఞానంతో ఎంతో అభివృద్ధి చెంది చంద్రయాన్ తో రాకెట్ ద్వారా చంద్రుని మీద అడుగు పడుతున్నప్పటికీ…ప్రాచీన కాలం నాటి శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన విద్యలను కూడా ఆదరించాలని కొందరు కోరుతున్నారు. ఎన్నో యుగాల నుంచి ఆనవాయితీగా వచ్చే కొన్ని శాస్త్రీయ విద్యలు నేడు కనుమరుగు అవుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా కొబ్బరి కాయ విద్యతో పొలాల్లో బోరు వేసేందుకు నీళ్ళ జాడ కనిపెట్టే ఈ విద్యకు ఇంకా పల్లెల్లో ఆదరణ ఉంది .ఈ విద్య లో ఎలాంటి మంత్రాలు.. తంత్రాలు లేవని, కేవలం రెండు కొబ్బరి కాయలతో శరీరంలోని మనసును లగ్నం చేస్తూ ఆధ్యాత్మిక శక్తితో కొబ్బరి కాయకు ఉండే మూడు నేత్రాలు ఆధారంగా తాను భూమిలోని జలపాతాన్ని కనుక్కునే విద్యను పది మందికి సహాయంగా ఉపయోగిస్తున్నాను అని అంటున్నాడు బుగ్గపాడు లోని అమ్మ వారి ఆలయ పూజారి నంద స్వామి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.