నాంపల్లి, సెప్టెంబర్ 15: నిలోఫర్ హాస్పిటల్లో ఆరు నెలల బాబు అపహరణకు గురయ్యాడు. బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 16 గంటలు గడుస్తున్నా లభించని బాబు ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. బాబు కనిపించకపోవడంతో కన్న తల్లి కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది. తన బాబుని తనకు అప్పగించాలి అంటూ ఆవేదన చెందుతోంది.
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నీలోఫర్ హాస్పిటల్ లో 6 నెలల బాబు పైసల్ ఖాన్ ను ఓ మహిళ అపహరించింది. గండిపేట క్రాస్ రోడ్ లో ఓ ఫామ్ హౌస్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి దంపతులకు పైసల్ ఖాన్ రెండవ కుమారుడు. నిన్న మధ్యాహ్నం పెద్ద బాబుకి బాలేకపోవడంతో నిలోఫర్ హాస్పిటల్ కు తీసుకొని రావడం జరిగింది. అనంతరం బాబుకి చికిత్స అందిస్తున్న సమయంలో రెండవ బాబుతో తల్లి ఫరీదా భేగం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వార్డులో కూర్చొని ఉంది. అక్కడికి ఎల్లో కలర్ స్కార్ఫ్ కట్టుకొని క్రీం కలర్ నైటీ వేసుకున్నటువంటి ఓ మహిళ ఫరీదా బేగం వద్దకు వచ్చింది. అనంతరం ఫరీదా బేగంతో వివిధ రకాల అంశాల గురించి మాట్లాడుకుంటూ ఆమెతో కలిసిపోయింది. అదే సమయంలో భోజనం పెడుతున్నారని చెప్పి తల్లి ఫరీదా బేగం భోజనం తెచ్చుకునేందుకు వెళ్ళింది. బాబును చూస్తూ ఉండవల్సిందిగా సదరు మహిళకు చెప్పి ఫరీదా బేగం వెళ్లింది.
అప్పటివరకు మాట్లాడినటువంటి మహిళ ఫోన్ చూపించుకుంటూ ఆ బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. తల్లి ఫరీదా బేగం భోజనం తీసుకొని వచ్చి చూసే లోపు మహిళతో సహా బాబు కనిపించలేదు. అదే సమయంలో అక్కడ ఉన్నటువంటి మరో మహిళ మీ బాబును అపరిచిందని చెప్పింది. ఫరీదా బేగంతో అపహరించిన మహిళ మాట్లాడుతూ ఉండడంతో బంధువులుగా భావించింది అక్కడ ఉన్నటువంటి మరో మహిళ. అనంతరం బాబు ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆసుపత్రి సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో కేసు క్లిష్టంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తమ బాబును తమకు అప్పగించాలని తల్లి ఫరీదా బేగం కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.