Telangana: దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ తెలంగాణలో.. గ్లోబల్ సమ్మిట్‌లో..

దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ ఏర్పాటు కానుంది. పురుషుల అకాడమీతో పాటు ఫిఫా-ఏఐఎఫ్ఎఫ్ భాగస్వామ్యంలో ఇది ఏర్పాటు కానుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో దీనికి సంబంధించిన కీలక ప్రకటన వెలువడనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే ఈ సమ్మిట్‌కు ప్రపంచ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలంగాణ సంస్కృతి, కళలు, రుచికరమైన వంటకాలను ప్రపంచానికి చాటిచెప్పేలా స్వాగత కిట్‌లు అందజేయనున్నారు.

Telangana: దేశంలోనే తొలి మహిళా ఫుట్‌బాల్ అకాడమీ తెలంగాణలో.. గ్లోబల్ సమ్మిట్‌లో..
India First Women Football Academy

Edited By: Krishna S

Updated on: Dec 02, 2025 | 9:19 PM

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో క్రీడారంగానికి సంబంధించి కీలక అడుగు పడనుంది. దేశంలోనే తొలి మహిళా ఫుట్ బాల్ అకాడమీ తెలంగాణలో ఏర్పాటు కానుంది. హంకాంగ్ తరవాత ప్రపంచంలోనే రెండో మహిళల ఫుట్ బాల్ అకాడమీ ఇదే కావడం విశేషం. దేశంలో రెండో పురుషుల ఫుట్‌బాల్ అకాడమీ కూడా తెలంగాణలోనే ఏర్పాటు చేయనున్నారు. డిసెంబరు 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సదస్సులో తెలంగాణ ఫిఫా – ఏఐఎఫ్ఎఫ్ ఫుట్ బాల్ అకాడమీలు వివరాలను ప్రకటించనున్నాయి. వీటితో పాటు హైదరాబాద్ అంతర్జాతీయ చెస్ నిర్వహణకు సంబంధించిన ప్రకటన కూడా సదస్సులో వెలువడనుంది.

గ్లోబల్ సమ్మిట్ హాజరయ్యే ప్రముఖులకు, అతిథుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్‌ బాల్‌ను అందజేయనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌కు ప్రపంచం నలుమూలల నుంచి కార్పొరేట్ ప్రతినిధులు, పరిశ్రమల ప్రముఖులు, పెట్టుబడిదారులు హాజరుకానున్నారు. వీరి కోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా స్వాగతం పలకనుంది. హైదరాబాద్‌కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికి గుర్తిండిపోయేలా సాంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కిట్‌‌లో ఏముంటాయంటే..

సదస్సుకు హాజరయ్యే అతిథులకు అందించే స్పెషల్ బాస్కెట్‌లో పోచంపల్లి ఇక్కత్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లను అందించనున్నారు. పోచంపల్లి శాలువా, చేర్యాల మాస్క్, హైదరాబాద్ అత్తర్, హైదరాబాద్ ముత్యాలతో చేసిన ఆభరణాలు ఇందులో ఉంటాయి. అదేవిధంగా ప్రత్యేక డిజైన్‌తో సిద్ధం చేసిన కల్చరల్ ఫుడ్ బాస్కెట్‌లో మహువ లడ్డులు, సకినాలు, అప్పాలు, బదామ్ కీ జాలి వంటి తెలంగాణ సాంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై ప్రదర్శించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..