Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో కీలక మార్పులు చేసింది. 2026-27 నుంచి డీబీటీ ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమ చేయడం, ఏడాది పొడవునా ఈ-పాస్ దరఖాస్తులు స్వీకరించడం, ఆటోమేటిక్ రెన్యువల్ వంటి కొత్త విధానాలను అమల్లోకి తీసుకురానుంది.

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్..
Students

Edited By:

Updated on: Jun 10, 2026 | 6:46 AM

తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ఎస్సీ సంక్షేమ శాఖ జీవో నం.9 జారీ చేసింది. ఇకపై బోధన ఫీజులు, ఉపకార వేతనాల కోసం విద్యార్థులు ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ-పాస్ పోర్టల్ నిరంతరం అందుబాటులో ఉండనుంది. అయితే ముందుగా దరఖాస్తు చేసిన వారికి ముందుగా ఫీజులు మంజూరు చేసే విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఆలస్యంగా దరఖాస్తు చేస్తే నిధుల విడుదల కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త విధానంలో విద్యా సంవత్సరానికి సంబంధించిన మొత్తం బోధన రుసుమును ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు విడతల వారీగా చెల్లింపులు జరిగేవి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులపై పడే ఆర్థిక భారం తగ్గనుంది. ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) విధానంలో ఫీజుల మొత్తాన్ని నేరుగా విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ విద్యార్థుల ఉపకార వేతనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్నే రాష్ట్రం అనుసరించనుంది.

విద్యార్థుల ఖాతాల్లో డబ్బు జమ అయిన తర్వాత వారంలోపు సంబంధిత కళాశాలలకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా చెల్లించకపోతే చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2026-27లో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆటోమేటిక్ రెన్యువల్ విధానం అందుబాటులోకి రానుంది. దీంతో ప్రతి ఏడాది రెన్యువల్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షల్లోపు ఉన్న విద్యార్థులు బోధన ఫీజులకు అర్హులు. రాష్ట్రంలో నివసిస్తున్న విద్యార్థులు మాత్రమే ఈ పథకం ప్రయోజనాలు పొందగలరు. విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ-పాస్ పోర్టల్‌లో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు లేవనెత్తిన సమస్యలను సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సి ఉంటుంది.

దరఖాస్తుల ఆధారంగా చెల్లింపులకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్ రూపొందించింది. ఏప్రిల్ నుంచి జులై వరకు దరఖాస్తు చేసిన వారికి ఆగస్టు 15 నాటికి, ఆగస్టు నుంచి నవంబర్ వరకు దరఖాస్తు చేసిన వారికి డిసెంబర్ 30 నాటికి, డిసెంబర్ నుంచి జనవరి వరకు దరఖాస్తు చేసిన వారికి ఫిబ్రవరి 28 నాటికి నిధులు విడుదల చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి మార్చి వరకు దరఖాస్తు చేసిన వారికి 15 రోజుల్లోపు చెల్లింపులు చేయనున్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో బోధన ఫీజులు లేదా ఉపకార వేతనాలు పొందినట్లు తేలితే, ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం హెచ్చరించింది.

బోధన ఫీజులు, ఉపకార వేతనాల అమలుపై ప్రతి ఏడాది సోషల్ ఆడిట్ నిర్వహించనున్నారు. అలాగే థర్డ్ పార్టీ సంస్థ ద్వారా మదింపు చేపట్టనున్నారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 10 శాతం విద్యాసంస్థలు, విద్యార్థుల దరఖాస్తులు, హాజరు, అర్హతలను పరిశీలించనున్నారు. అదే సమయంలో విద్యాసంస్థల్లో ఆధార్ ఆధారిత హాజరు వ్యవస్థను తప్పనిసరి చేయనున్నారు. హాజరు వివరాలను ఈ-పాస్ పోర్టల్ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us