రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్.. ఒక్కో వ్యక్తికి 18 కేజీల బియ్యం!
ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయనుంది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. రేషన్ డీలర్లు మాత్రం నిల్వ, పంపిణీ, ఈ-పాస్ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందించేందుకు చర్యలు చేపట్టింది. గతంలో అధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల సమయంలో కూడా ఇదే విధానాన్ని అమలు చేసిన కేంద్రం, ఇప్పుడు మరోసారి ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి లబ్ధిదారుడికి మూడు నెలలకు కలిపి మొత్తం 18 కిలోల బియ్యాన్ని ఒకేసారి అందజేయనున్నారు. ప్రతి నెలా ఒక వ్యక్తికి 6 కేజీల బియ్యం ఇస్తారు. ఆ లెక్కన మూడు నెలలకు కలిపి ఒకేసారి 18 కేజీలు ఇవ్వనున్నారు. కార్డులో ఒక వ్యక్తి పేరు ఉంటే 18 కేజీలు, ఇద్దరు సభ్యులు ఉంటే 36 కేజీలు, ముగ్గురు ఉంటే 54 కేజీలు, నలుగురు సభ్యులు 72 కేజీల బియ్యం ఇవ్వనున్నారు. ఇప్పటికే వేసవి కాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కూడా ఒకేసారి పంపిణీ చేశారు. అనంతరం జూలై నుంచి మళ్లీ నెలవారీ రేషన్ పంపిణీ ప్రారంభించారు. అయితే ప్రస్తుతం వర్షాభావం, కరువు పరిస్థితులపై వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మరోసారి మూడు నెలల బియ్యాన్ని ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. రేషన్ డీలర్లకు బియ్యం సరఫరా కూడా మొదలైంది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం వల్ల రేషన్ డీలర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ఒకేసారి భారీ మొత్తంలో బియ్యం నిల్వ చేయడానికి చాలా దుకాణాల్లో తగిన స్థలం లేదని వారు పేర్కొంటున్నారు. నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటంతో బియ్యాన్ని భద్రపరచడం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా భారీ పరిమాణంలో బియ్యం పంపిణీ చేసే సమయంలో తూకంలో తరుగు వచ్చే అవకాశం ఉందని, ఈ-పాస్ యంత్రాల్లో తరచూ నెట్‌వర్క్ సమస్యలు తలెత్తుతున్నాయని డీలర్లు చెబుతున్నారు. లబ్ధిదారుల వేలిముద్రలు సరిగా నమోదు కాకపోవడంతో ఒక్కో వ్యక్తికి రేషన్ ఇవ్వడానికి 15 నుంచి 20 నిమిషాల వరకు సమయం పడుతోందని తెలిపారు. దీంతో దుకాణాల వద్ద క్యూలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వం మాత్రం కరువు పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగానే మూడు నెలల బియ్యం అందించడం వల్ల లబ్ధిదారులు భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించగలరని అధికారులు భావిస్తున్నారు. పంపిణీ ప్రక్రియను సజావుగా పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
