
మొన్న రాజీవ్ గాంధీ, నిన్న తెలంగాణ తల్లి, నేడు వాజ్‌పేయ్ ఇలా తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలు సచివాలయంలో విగ్రహాల ఏర్పాటుపై పోటా పోటీ ప్రకటనలు చేస్తుంటే.. అసలు అక్కడ రాజకీయ నాయకుల విగ్రహాలు వద్దే వద్దంటూ షాకిచ్చారు ఓ బీజేపీ ఎమ్మెల్యే. తెలంగాణ సచివాలయంలో మా నాయకుడు రాజీవ్ విగ్రహం పెడతామని కాంగ్రెస్ అంటే.. మేం అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని తొలగించి తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని కౌంటర్ ఇచ్చింది బీఆర్ఎస్. మీరు మీరు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటే మేం చూస్తూ ఊరుకోవాలా అంటూ బీజేపీ లైన్లోకి వచ్చేసింది. అక్కడ మాజీ ప్రధాని వాజ్ పేయ్ విగ్రహం పెట్టాలని మాకూ ఉంది కానీ మేం ఇప్పుడు ఆ చర్చ పెట్టడంలేదంటోంది. ఇలా గత కొంత కాలంగా తెలంగాణలో రాజకీయం మొత్తం విగ్రహాల చుట్టూనే నడుస్తోంది.
తెలంగాణ సచివాలయం పరిసరాల్లో రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, పి.వి నరసింహారావు విగ్రహాలు ఉన్నాయి. దేశం కోసం ప్రాణాలు అర్పించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాం ఇక్కడ లేకపోవడం లోటుగా ఉందని సచివాలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి సచివాయంలో రాజీవ్ గాంధీ విగ్రహాం పెట్టేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
రాజీవ్ విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన వెంటనే రియాక్టయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆలస్యం చేసి వందలాది అమరవీరుల ప్రాణాలు బలిగొన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ విగ్రహా ఏర్పాటును వ్యతిరేకిస్తున్నామని ప్రకటించారు. మరో నాలుగేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించి ఆ స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు కేటీఆర్.
రుణమాఫీ అంశంపై ప్రజల్లో చర్చ జరగకుండా ప్రజలను పక్కదారి పట్టించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి విగ్రహ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు బండి సంజయ్. విగ్రహాల మీద జరుగుతున్న చర్చ అనవసరమని సచివాలయంలో వాజ్‌పేయి విగ్రహం పెట్టాలని మాకు కూడా ఉందని..ఎవరి విగ్రహం పెట్టాలో ప్రజలనే అడుగుదామని ఆయన అన్నారు. సచివాలయంలో వై నాట్ వాజ్‌పేయి విగ్రహం అని బండి సంజయ్ అంటే.. దానికి పూర్తి విరుద్ధంగా అసలు రాజకీయ నాయకుల విగ్రహాలే అవసరం లేదంటూ షాకిచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వీలైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం లేదా, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండటానికి కారణమైన రాణి రుద్రమదేవి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాకేష్ రెడ్డి. మొత్తానికి సచివాయలంలో విగ్రహాల ఏర్పాటుపై తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీల ప్రకటనలు చూస్తుంటే కాదేది రాజకీయాలకు అనర్హం అనే విషయం రుజువవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..