Kavitha: మొన్న లెటర్ లీక్.. నిన్న చిట్‌చాట్ టాక్.. కారు పార్టీలో కల్లోలం.. కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్ ఇదే..
గులాబీదళమంతా బతుకమ్మలా నెత్తిన పెట్టుకున్న కవితమ్మ పొలిటికల్ సిరీస్ కంటిన్యూ అవుతోంది...! ఓవైపు లెటర్ లీక్... మరోవైపు చిట్‌చాట్ టాక్‌తో థ్రిల్లర్‌తో కూడా పొలిటికల్ డ్రామా నడుస్తోంది..! కవిత ఎపిసోడ్‌లో కుటుంబ విభేదాలు, నాయకత్వ అంశాలను పక్కనపెడితే.. సెకెండ్ టార్గెట్ కమలంపార్టీనే చేసినట్లు కనిపిస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతోందని డే-వన్ నుంచి దరువేస్తోంది కవిత. మరీ విలీనం వ్యవహారాన్ని కమలంపార్టీ ఎలా చూస్తోంది..? కారుపార్టీ ఏమంటోంది..? అన్నీ గమనిస్తున్న హస్తంపార్టీ రియాక్షన్ ఏంటి..?

కారుపార్టీలో కవిత కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు..! పార్టీలో పరిస్థితులు బాలేవంటూ అధినేత కేసీఆర్‌కు లేఖ రాసి సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత.. చిట్‌చాట్‌ల పేరుతో పొలిటికల్ సెన్సేషన్‌గా మారిపోయారు. రోజురోజుకు డోస్ పెంచుతూ తెలంగాణ ప్రజలకు పక్కా పొలిటికల్ థ్రిల్లర్ చూపిస్తున్నారు. లిక్కర్ కేసులో తనను అరెస్ట్ చేసిన కమలంపార్టీపై మరోమారు కన్నెర్ర చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర అంటూ నెక్ట్స్ లెవల్ కామెంట్స్ చేయడం ఇప్పుడు రాజకీయ రచ్చ లేపుతోంది.
బీజేపీతో పొత్తు పెట్టుకుని బాగుపడిన పార్టీలు చరిత్రలో లేవన్నారు కవిత. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేస్తామంటే అస్సలు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నారామె. బీజేపీ వైపు బీఆర్ఎస్ అసలు చూడొద్దంటున్నారు. తనకంటూ ప్రత్యేకంగా జెండా-అజెండా లాంటివి ఏంలేవన్న ఆమె.. పార్టీని కాపాడుకోవడమే తన ఎజెండా అన్నారు.
ఈ లేటెస్ట్ చిట్‌చాటే ఇప్పుడు రచ్చలేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేశాయని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి విరుచుకుపడ్డారు. గులాబీ-కమలం రెండూ ఒకటేనని.. ఆ రెండుపార్టీలు ఢిల్లీలో ఫ్రెండ్స్ అన్న విషయం కవిత కామెంట్స్‌తో మరోసారి క్లారిటీ వచ్చిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆడించే వారు వారే.. ఆడే వారు వారే అంటూ ఆయన కూడా చిట్‌చాట్‌లోనే రియాక్టయ్యారు.
అటు కవిత, ఇటు కాంగ్రెస్ నేతల కామెంట్స్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు కాషాయంపార్టీ నేతలు. ఏం మాట్లాడుతున్నారు..? ఎవరికి కావాలి పొత్తు..? ఎందుకోసం విలీనం..? అంటూ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఫుల్ సీరియస్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపేందుకు కుట్రలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి సంబంధించి ఎలాంటి చర్చలు జరగలేదు.. అసలు బీఆర్ఎస్‌తో తమకు అవసరమే లేదంటూ పేర్కొన్నారు.
మొత్తంగా.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతోందన్న కవిత కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. మూడు పార్టీల మధ్య డైలాగ్ వార్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. మరి కవిత ఇంకెలాంటి కామెంట్స్ చేస్తారో..! ఈ విలీనం వ్యవహారం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి..!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




